ప్రముఖ పురాణ ప్రవచనకర్త కన్నుమూత.. ఆయన ప్రత్యేకత ఏంటంటే?

Chakravarthi Kalyan
ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూశారు. 96 ఏళ్ల వయోభారం కారణంగా ఆయన శివైక్యం అయ్యారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని తన స్వగృహంలో ఆయన పరమపదించారు. ఆయన మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం జగన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. శనివారం ఉదయం సికింద్రాబాద్   బన్సీలాల్‌పేట్‌లోని హిందూ స్మశాన వాటికలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి  అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇంతకీ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి ప్రత్యేకత ఏమిటి.. ఈ విషయం ఈ తరం యువతకు తెలియదు. కానీ.. మల్లాది చంద్రశేఖర శాస్త్రి  తిరుపతి తిరుమల దేవస్థానం ఆస్థానానికి శాశ్వత పండితుడుగా కొనసాగారు. ఆయన పురాణ ప్రవచనలో మేటిగా చెప్పుకుంటారు.  పురాణాలను శాస్త్రబద్ధంగా వివరించడంలో ఆయనది అందె వేసిన చెయ్యిగా చెబుతారు. ఆయన తన వాక్పటిమతో ఎందరినో ధర్మ మార్గంలో నడిపించారు.

మల్లాది చంద్రశేఖర శాస్త్రి 1925 ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో పుట్టారు. కేవలం తిరుమలలోనే కాదు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలోనూ ఆయన సేవలు అందించారు. సీతరాముల కల్యాణ వేడుకల  ప్రత్యక్ష వ్యాఖ్యానాలలో ఆయన ప్రసిద్ధి పొందారు. ఈ క్రతువులో ఉషశ్రీతో కలిసి మల్లాది చంద్రశేఖర శాస్త్రి  పాల్గొన్నారు.

మల్లాది చంద్రశేఖర శాస్త్రి  అనేక గ్రంధాలు కూడా రచించారు. వాటిలో భారతము ధర్మసూక్ష దర్శనము, కృష్ణలహరితో పాటు రామాయణ రహస్య దర్శిని వంటివి ఉన్నాయి. ఇవి కాకుండా వేదాలు, శ్రౌతస్మార్త, వ్యాకరణతర్క వేదస్త సాహిత్యాలను ఆయన ఔపాసన పట్టారు. మల్లాది చంద్రశేఖరశాస్త్రి మృతి విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్య తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మల్లాది చంద్రశేఖరశాస్త్రి కుటుంబ సభ్యులకు ఏపీ సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి మల్లాది అని సీఎం జగన్ గుర్తుచేసుకున్నారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి ఇకలేరన్న వార్త తనకు ఎంతో బాధ కలిగించిందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: