చంద్రబాబు మనసులో మాట: అంతా చిరంజీవే చేశారు?
2009తో గెలుపు కోసం చంద్రబాబు ఎన్నో వ్యూహాలు పన్నారు. తనకు పెద్దగా గిట్టని కమ్యూనిస్టులతోనూ చేయికలిపారు. తెలంగాణ వాదంపై పెద్దగా ప్రేమ లేకపోయినా సరే.. కేసీఆర్‌నూ కలుపుకుపోయారు. అలా మొత్తానికి మహా కూటమి ఏర్పాటు చేశారు. ఈ మహా కూటమిని చూసి అప్పట్లో అంతా ఆహా అనుకున్నారు. ఇంత మంది మహామహులు కలిశారు.. ఇక వైఎస్సార్ ఇంటికి వెళ్లినట్టే అనుకున్నారు. చంద్రబాబు కూడా అదే అనుకున్నారు.
కానీ అక్కడే లెక్క తప్పింది. సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి.. అందరి అంచనాలను తలకిందులు చేశాడు. సొంతంగా అధికారంలోకి రావాలన్న ఆయన కోరిక తీరకపోగా.. కనీసం ప్రభావం చూపగలిగే స్థాయిలోనైనా ఎమ్మెల్యే సీట్లు సాధించలేకపోయారు. 294 ఎమ్మెల్యేలున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేవలం 18 స్థానాలు మాత్రమే చిరంజీవి దక్కించుకున్నారు. అయితే చిరంజీవి తాను గెలవలేదు సరి కదా.. అదే సమయంలో ఆయన మహాకూటమి విజయ అవకాశాలను దారుణంగా దెబ్బ తీశారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులు గెలవకపోయినా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును బాగా చీల్చారు. దీంతో మహా కూటమి అభ్యర్థులు చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అదే చిరంజీవి బరిలో లేకుండా కచ్చితంగా మాహాకూటమే అధికారంలోకి వచ్చేదని చాలామంది అంటుంటారు. తాజాగా ఈ మాట చంద్రబాబు కూడా అనేశారు. తన ఓటమికి చిరంజీవి కారణం అయినా.. తాను చిరంజీవితో బాగానే ఉంటానని.. ఆయన కూడా తనతో బాగానే ఉంటాడని అన్నారు. ఇదంతా సినీరంగానికి టీడీపీ రంగు అంటకట్టడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ఇలా స్పందించారు. అదీ సంగతి.