పాపం..! 11 సార్లు టీకా తీసుకున్నాడట.. ఎందుకంటే..?

Chakravarthi Kalyan
కరోనా నుంచి మనల్ని కాపాడేది టీకా ఒక్కటే.. మొదటి నుంచి నిపుణులు చెబుతున్నది ఇదే.. మాస్కు పెట్టుకోండి.. సామాజిక దూరం పాటించండి.. టీకా తీసుకోండి.. ఈ మూడు పాటిస్తే కరోనా మిమ్మల్ని ఏమీ చేయదని ప్రభుత్వం చెబుతూనే ఉంది. అయితే.. కరోనా టీకా వచ్చిన మొదట్లో టీకా వేయించుకోవాలంటే చాలా మంది భయపడిపోయారు. ఆ తర్వాత క్రమంగా జనం టీకా కోసం ముందుకు వచ్చారు. అయితే.. సెకండ్‌ వేవ్‌ ఉధృతితో ఒక్కసారిగా కరోనా టీకాలకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. మళ్లీ ఇప్పుడు జనంలో కరోనా టీకా అంటే  ఆసక్తి తగ్గుతోంది.


అయితే..  వ్యక్తి మాత్రం ఇప్పటికి ఏకంగా 11 సార్లు కరోనా టీకా వేయించుకున్నాడట. ఇప్పుడు బీహార్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. మాధేపుర జిల్లాకు చెందిన 84 ఏళ్ల బ్రహ్మదేవ్‌ మండల్‌ అనే వృద్ధుడు ఇప్పటి వరకు 11 సార్లు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నానని చెబుతున్నాడు. 2021 ఫిబ్రవరి 13 నుంచి డిసెంబరు వరకు ఇప్పటి వరకూ 11 డోసులు తీసుకున్నాడట.


ఈ మధ్య 12వ డోసు తీసుకోవడానికి బ్రహ్మదేవ్‌ మండల్‌ వెళ్లగా అప్పటికే టీకాల కార్యక్రమం ముగిసిందని అక్కడి సిబ్బంది చెప్పారట. అప్పుడే తాను ఎన్నిసార్లు టీకా డోసులు తీసుకున్నాడో చెప్పాడట. మరి ఎందుకు ఇన్నిసార్లు టీకా వేయించుకున్నావని అడిగితే.. కొవిడ్‌ టీకా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తనకు కొందరు చెప్పారని.. అందుకే తాను అన్నిసార్లు వేసుకున్నానని బ్రహ్మదేవ్‌ మండల్‌ చెబుతున్నాడు.


అంతే కాదు.. ఈ వృద్ధుడు ఎప్పుడెప్పుడు టీకా వేయించుకున్నది కూడా రికార్డు చేసి పెట్టుకున్నాడు. అయితే మరికొందరు మాత్రం ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్‌ కావచ్చంటున్నారు. ఎందుకంటే.. టీకా తీసుకోవాలంటే.. ఆధార్‌ కార్డుతో పాటు నమోదు చేసుకోవాల్సిందే. ఆ వివరాలు అన్నీ నమోదు చేశాకే టీకా వేస్తున్నారు. మరి ఇన్నిసార్లు ఎలాంటి ఆటంకం లేకుండా 11 సార్లు టీకా వేయించుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: