పంజాబ్‌లో మోదీకి అవమానం..? సహిస్తారా..?
పంజాబ్‌లోని హుస్సేనివాలాలో ఉన్న జాతీయ అమరవీరుల స్మారకాన్ని సందర్శించే లక్ష్యంతో ప్రధాని మోదీ బుధవారం బఠిండా చేరుకున్నారు. ఆ తర్వాత హెలికాఫ్టర్ ద్వారా సందర్శనా స్థలానికి వెళ్లేందుకు ఏర్పాట్లు జరిగినా, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా చేరుకునేందుకు నిర్ణయించారు. దీంతో పంజాబ్ డీజీపీకి ప్రధాని వెళ్లే మార్గంపై వివరాలు అందించారు. ఆ మార్గంలో భద్రతాపరమైన అంశాలపై పంజాబ్ పోలీస్ శాఖ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలియజేశాకనే ప్రధాని కాన్వాయ్ బయలుదేరింది. అయితే దారిలో కొందరు ఆందోళనకారులు రహదారిని నిర్బంధించడంతో ప్రధాని వాహనం సహా కాన్వాయ్ అంతా ఓ ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోయింది. దీంతో ప్రధాని బఠిండా ఎయిర్‌పోర్టుకు తిరిగి వెళ్లిపోయారు. పంజాబ్ ప్రభుత్వం ప్రధాని పర్యటనకు భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం కావడమే జరిగిన ఘటనకు కారణమని కేంద్ర హోం శాఖ ఆగ్రహించి, దీనిపై నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో హోరాహోరీ తలపడేందుకు కాంగ్రెస్, బీజేపీ కూటమి, ఆప్ పార్టీలు ఇప్పటికే కత్తులు దూసుకుంటూ ప్రచార పర్వంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఈ ఘటన రాజకీయ పక్షాల మధ్య పరస్పర విమర్శలకు కేంద్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ధిక్కారాన్నే సహింతునా అన్నట్టుండే ప్రధాని మోదీకి అవమానమే ఎదురైతే తదుపరి చర్యలు ఎలా ఉంటాయో మరి.