అదిరింది: వరి విత్తుతున్నడ్రోన్.. కూలీలతో పని లేదు..!
గతంలో వరినాటు వేసేవారు.. నారు మడిగా వేసి.. ఆ తర్వాత దాన్ని పీకి.. మిగిలిన పొలాల్లో నాటు వేసేవారు.. ఇది పాతపద్దతి.. ఇప్పుడు వరి కూడా వెదజల్లే పద్దతి కూడా వచ్చింది. చాలా చోట్ల వెదజల్లే పద్దతిలోనూ వరి వేస్తున్నారు. ఇలా డ్రోన్ ద్వారా వరి వెదజల్లే పద్ధతి ద్వారా సాగు వ్యయం తగ్గించవచ్చని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటోంది. ఈ పద్దతిలో కూలీల అవసరం లేకుండా నేరుగా డ్రోన్‌తో విత్తనాలు విత్తే విధానంపై ఈ వర్శిటీ పరిశోధన చేసింది. ఈ పద్దతితో సత్ఫలితాలు వచ్చాయని చెబుతోంది.
ఐఐటీలో ఇంజినీరింగ్ చదివిన ప్రేమ్ అనే యువకుడు ఈ డ్రోన్ ద్వారా వెదజల్లే పద్దతిని ప్రవేశపెట్టాడు. ఆయనకు వచ్చిన ఆలోచనకు జయశంకర్ వర్సిటీ మరింత పదను పెట్టింది. దీన్ని ఎంతవరకూ అమల్లోకి తేవచ్చు అనే అంశంపై మరిన్ని పరిశోధనలు చేసింది. చివరకు ప్రేమ్ స్థాపించిన అంకుర సంస్థ, జయశంకర్ వర్సిటీ సంయుక్తంగా ఈ డ్రోన్ ద్వారా వరి వెదజల్లే పద్దతిని అభివృద్ధి చేశాయి. అంతే కాదు.. ఈ డ్రోన్‌తో వరి విత్తనాలు విత్తే పరిజ్ఞానంపై అంకుర సంస్థ, జయశంకర్ వర్శిటీ కలిసి పేటెంట్ కోసం కూడా అప్లయ్ చేశాయి.
ఇలా డ్రోన్ ద్వారా వరి వెదజల్లే పద్ధతితో అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. వరసల ప్రకారం వరి మొక్కలు పెరగడం వల్ల కలుపుతీత, ఎరువులు, పురుగుమందుల పిచికారీ కూడా యంత్రాల ద్వారా చేయవచ్చట. కోత వంటి పనులు కూడా పూర్తిగా యంత్రాలతోనే చేయవచ్చట. ఈ పద్దతిలో వరి సాగులో కూలీల వినియోగం 70 వరకూ తగ్గుతుందట. ఇదేదో బావుంది కదా.