ప్రపంచాన్ని ఏలేస్తున్న కొరియన్ కంపెనీలు..?
ప్రపంచంలో మొదటి పారిశ్రామిక విప్లవం మొదలైంది యూరోపియన్ దేశాల్లోనే. అందుకే అవి ప్రపంచాన్ని శాసించగలిగాయి. తరువాతకాలంలో ఆ దేశాల ప్రజలు వలస వెళ్లి అభివృద్ధి చేసిన ఉత్తర అమెరికా దానిని మరింత ముందుకు తీసుకువెళ్లడమే కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థకు బలమైన పునాది వేసి, ప్రపంచాన్ని శాసించే అగ్రదేశంగా నిలిచింది. కార్లు, విమానాల నుంచి కంప్యూటర్ ల దాకా మొదటగా ఉత్పత్తి చేసింది అమెరికా. ఈ ఉత్పత్తుల తయారీలో పాశ్చాత్త దేశాల ప్రాభవాన్ని తొలిసారిగా దెబ్బ కొట్టిన తొలి ఆసియా దేశం జపాన్. ఆ దేశానికి చెందిన సుజుకీ, హోండా తదితర కంపెనీలు ఉత్పత్తి చేసిన కార్లతో పోటీ పడలేక ఒక దశలో అమెరికాకు చెందిన పలు కార్ల తయారీ పరిశ్రమలు మూతపడ్డాయంటే జపాన్ హవా ఎలా నడిచిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జపాన్ కంపెనీలకు సైతం దడ పుట్టిస్తున్న దేశంగా సౌత్ కొరియా ఎదిగింది. ఈ దేశం పారిశ్రామికంగా ఇలా వెలుగుతుండగా దాని పొరుగు దేశం నార్త్ కొరియా మాత్రం నియంతల బారినపడి, కేవలం బొగ్గు, ఐరన్ ఓర్, ఆయుధాలు ఎగుమతి చేసుకునే దేశంగా మిగిలిపోవడం విషాదం.