కమలం వద్దు కమ్యూనిస్టులే ముద్దు!
జనసేనతో పొత్తు పెట్టుకుంటేనే పార్టీకి ప్లస్ అవుతుందనే కోణంలో టీడీపీ ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసి ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి డ్యామేజ్ జరిగింది. అటు జనసేన గెలవలేదు..ఇటు టీడీపీ గెలవలేదు. మధ్యలో వైసీపీకి ప్లస్ అయింది. ఈ సారి మాత్రం వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదంటే టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకుని బరిలో దిగడానికి రెడీ అవుతున్నాయని తెలుస్తోంది.
అదే సమయంలో బీజేపీ కూడా వీరితో కలిసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే బీజేపీ కలవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయి. అదే సమయంలో ఏపీకి బీజేపీ చేసింది ఏమి లేదు. ఏపీ ప్రజలు బీజేపీపై బాగా ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీపై ఉన్న నెగిటివ్ టీడీపీపై పడే అవకాశం ఉంది. అన్నిటికీమించి క్షేత్ర స్థాయిలో బీజేపీకి బలం లేదు.
అసలు బీజేపీ కంటే కమ్యూనిస్టులే బెటర్ అని తమ్ముళ్ళు భావిస్తున్నారు. కమ్యూనిస్టులకు ఏజెన్సీ నియోజకవర్గాల్లో గానీ, కొన్ని ప్రాంతాల్లో మంచి ఓటింగ్ ఉందని, కాబట్టి కమ్యూనిస్టులని కలుపుకునే వెళితే బెటర్ అని తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీని దూరం పెడితేనే బెటర్ అంటున్నారు. ఏదో కేంద్రంలో అధికారంలో ఉందనే పేరు తప్ప ఏపీలో బీజేపీకి బలం లేదు కాబట్టి ఆ పార్టీతో కలిస్తే టీడీపీకే డ్యామేజ్ అంటున్నారు. నెక్స్ట్ జనసేన, కమ్యూనిస్టులని కలుపుకుని వెళితే ప్లస్ అవుతుందని చెబుతున్నారు.