హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2021: పాలకులకు ఇది ఆర్థిక సంక్షోభ సంవత్సరం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ఏడాది ఆర్థిక సంక్షోభ సంవత్సరం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మరింత క్రిందకు జారింది. ఉద్యోగులు సమయానికి జీతాలు వస్తాయా ? రావా అన్న దిగులుతో గడిపారు. సామాన్య ఉద్యోగులే కాదు సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం ఇదే పరిస్థితి. కరోనా కాలం అటుంచితే ఏ అధికారి కూడా సచివాలయానికి వచ్చి పనిచేసిన సందర్భాలు వేళ్లమీద లెక్కించ వచ్చు. వర్క్ ఫ్రం హోం పేరుతో సీనియర్ అధికారులు ఇంటికే పరిమితమయ్యారు. కారణం అందరికీ తెలిసిందే. ఖాళీ ఖజానాతో ఉన్నప్పుడు మనం వెళ్లి అక్కడ ఏం చేస్తాం అన్నధోరణిలో వాళ్లు గడిపారు.
వీరికి తగ్గట్టే ఎం.ఎల్.ఏలు కూడా సచివాలయానికి ఏ ఒకట్రండు మార్లుమాత్రమే వచ్చుంటారు. ఏ అధికారి దగ్గరకు వెళ్లినా ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తుండటంతో చేసేదేమీ లేక, శాసన సభ్యులు కూడా సచివాలయానికి రాకుండా కేవలం నియోజక వర్గానికి మాత్రమే పరిమితమయ్యారు.
ఎం.ఎల్.ఏల పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎన్నడూ లేని విదంగా పదవుల పందేరం చేశారు. చాలా పెద్ద సంఖ్యలో కార్పోరేషన్ లను ఏర్పాటు చేశారు. చైర్మన్ లను, పాలక మండలిసభ్యులను ఏర్పాటు చేశారు. ఓ విదంగా పదవుల తాయిలం అయితే పంచేశారు. కానీ పదవులు అందుకున్న వారు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కార్పోరేషన్ పదవులు కేవలం లెటర్ హెడ్ పై అచ్చువైేసుకోవడానికి పరిమితమని వారు వాపోతున్నారు. తమ కార్పోరేషన్ ఖతాలో చల్లిగవ్వ కూడా లేదని, కనీకం ఆఫీసు కూడా ఇంకా కేటాయింపు జరగ లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం మూలంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అయోమయ నైరాస్య పూరితమైన వాతావరణం నెలకొంది. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కడం ఎలా అన్న మీమాంస అందరినీ అయోమయానికి గురి చేస్తోంది.