ఆనందయ్య మందుకు అనుమతి నిరాకరణ.. ఎందుకంటే..!

NAGARJUNA NAKKA
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య పసరు మందుకు ఆయుష్ శాఖ అనుమతి నిరాకరించింది. ఒమిక్రాన్ వేరియంట్ కు మందు ఇస్తానని ఇటీవల ఆనందయ్య ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ తమను సంప్రదించలేదనీ.. ఇలాంటి గుర్తింపు లేని వ్యక్తులు అందించే మందులను ఆయుర్వేదిక్ మందులుగా భావించి వాడొద్దని ఆయుష్ శాఖ సూచించింది. గుర్తింపు పొందిన ఆయుష్ 64, ఆర్సెనిక్ ఆల్బమ్ 30సి లాంటి మందులే వాడాలని తెలిపింది.
ఇక ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఒకరికి, తూర్పుగోదావరి జిల్లాలో మరొకరికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. తాజాగా వైరస్ సోకిన ఇద్దర్ని విశాఖలోని క్వారంటైన్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కేసుల సంఖ్య 4కి చేరింది. ఇదిలా ఉండగా.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 360కి చేరింది. తెలంగాణలో 38మంది ఈ వైరస్ బారిన పడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అతని భార్య, తల్లికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో స్వచ్ఛంద బంద్ కు తీర్మానించింది. జనవరి 2వరకు ఉదయం 10గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలనీ.. లేకుంటే వెయ్యి రూపాయల ఫైన్ వేస్తామని నిర్ణయించింది.
ఇక ఢిల్లీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. అర్హులందరికీ ఫస్ట్ డోస్ అందించినట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. 148.33లక్షల మంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్లు ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగస్వాములైన వైద్యులు, వైద్యసిబ్బంది, టీచర్లు, ఆశా వర్కర్లతో పాటు సంబంధిత సిబ్బందికి కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. 67ఒమిక్రాన్ కేసులతో దేశంలో ఢిల్లీ 2వ స్థానంలో ఉంది.
మరోవైపు కరోనా మొదలైనప్పటి నుంచి హెల్త్ వర్కర్లు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. ఈ క్రమంలోనే రాజస్థాన్ కు చెందిన ఒక హెల్త్ వర్కర్ చేసిన పని అందరితో శెభాష్ అనిపించుకుంటోంది. ఆమె వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా మారుమూల గ్రామాల్లో ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు ఏకంగా ఒంటెపై వెళ్తూ అందరికీ ఆమె టీకా ఇస్తోంది. ఎడారిలో ఆమె వెళ్తుండగా తీసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: