సినిమా, టీవీ నిర్మాతలకు షాక్ ఇచ్చిన కేసీఆర్..?
ఇకపై సినిమాలు, ఇతర చిత్రీకరణలో చిన్నారులు నటించేందుకు నిర్మాతలు ఏకంగా కలెక్టర్ల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలట. అంతే కాదు.. సదరు నిర్మాత లేదా దర్శకులే ఈ మేరకు అనుమతి తీసుకోవాలట. పిల్లలతో నటింపజేయాలంటే ఎన్నో నిబంధనలు ఉన్నాయి. పిల్లలతో రోజుకు ఐదు గంటలకు మించి నటింపజేయకూడదు. అలాగే విరామం లేకుండా మూడు గంటలకు మించి చిన్నారులను చిత్రీకరణలో పని చేయించకూడదట. అంతే కాదు.. చిత్రీకరణ సమయంలోనూ అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి.
షూటింగ్‌ల సమయంలో చిన్నారుల పరిరక్షణ, విద్యాహక్కు చట్టం, లైంగిక వేధింపుల చట్టంలోని నిబంధనల్నీ పాటించాలి. వీటికి ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా చూసుకోవాలి. అదే సమయంలో నటించే పిల్లల విద్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. అందు కోసం.. ఏ పిల్లలనూ 27 రోజులకు మించి షూటింగ్‌కు అనుమతించకూడదు. అలాగే.. ఐదుగురికి మించి చిన్నారులు చిత్రీకరణలో ఉంటే వారి పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించాలి.
ఇంకా.. సినిమాల్లో నటించే పిల్లలకు వచ్చే ఆదాయంలో కనీసం 25శాతం మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలి. అలా దాచిన మొత్తాన్ని ఆ పిల్ల నటుడు మేజర్ అయ్యాక తీసుకునేలా ఏర్పాటు చేయాలి. అలాగే నటించే పిల్లల ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఎలాంటి షూటింగ్‌లోనూ బలవంతం చేయకూడదు. ఇవీ పిల్లలతో నటింపజేయాలనుకున్న దర్శకులు పాటించాల్సిన కొన్ని నిబంధనలు.