లా పాయింట్: భార్యకు తెలియకుండా ఆ పని చేస్తే తప్పే..?
విడాకుల కోరుతున్న ఓ భర్త.. అందుకు సాక్ష్యం చూపించాలనుకున్నాడు. అందుకోసం రహస్యంగా తన భార్య ఫోన్ కాల్స్ రికార్డు చేయడం ప్రారంభించాడు. తనకు అనుకూలమైన సంభాషణలు దొరకగానే దాన్ని ఆధారంగా కోర్టుకు సమర్పించాడు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు విడాకులు కోరుతున్న భర్తను సాక్ష్యాధారాలు అడిగింది. ఆధారాలు సమర్పిస్తానన్న భర్త.. తన భార్య సంభాషణలకు సంబంధించిన సీడీని కోర్టుకు సమర్పించాడు. ఈ ఆడియో ఆధారంగా కింది కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే.. దీనిపై భార్య హైకోర్టును ఆశ్రయించింది.
ఆ సంభాషణలు తన అనుమతి లేకుండా భర్త రికార్డు చేశాడని.. ఆ మాటలను సాక్ష్యంగా పరిగణించకూడదంటూ భార్య వాదించింది. అంతే కాదు.. మొబైల్ ఫోన్ ఆడియోలు సాక్ష్యాలుగా పరిగణించకూడదని భారత సాక్ష్యాల చట్టంలోని సెక్షన్ 65 చెబుతుందన్న భార్య తరపు లాయర్.. కింది స్థాయి కుటుంబ న్యాయస్థానం దీన్ని పట్టించుకోలేదని వాదించారు. తనకు తెలియకుండా రికార్డు చేసిన సంభాషణల్లో వాస్తవం ఉన్నా.. దాన్ని సాక్ష్యంగా పరిగణించకూడదని భార్య తరపు లాయర్ వాదించారు.
ఆ వాదనను పరిశీలించిన హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను తిరస్కరించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే భార్యకు తెలియకుండా రికార్డు చేయాల్సి వచ్చిందన్న భర్త వాదనను కోర్టు పట్టించుకోలేదు. అందుకే కోర్టుల్లో సాక్ష్యాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి.