శభాష్: దేశవిభజనపై ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు..?
దేశ విభజన తర్వాత మొదలైన మరో గాయం.. కాశ్మీర్.. ఈ ప్రాంత రాజు ఇండియాలో తన రాజ్యాన్ని కలిపేసినా అక్కడ జనం మెజారిటీ ముస్లింలు కాబట్టి.. ఇది తమ ప్రాంతమే అని పాక్ వాదించింది. ఆ మేరకు ఇండియాతో యుద్ధానికి కాలు దువ్వింది. కొంత భాగం ఆక్రమించింది కూడా. అప్పటి నుంచి కాశ్మీరం రాజుకుంటూనే ఉంది. అయితే.. కాశ్మీర్‌లోని ప్రధాన పార్టీలు మాత్రం ఇప్పటికీ తమ దేశ భక్తిని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన దేశ విభజన జరగడం కచ్చితంగా చారిత్రక తప్పిదమేనని అన్నారు.
పాకిస్థాన్ కావాలని మహమ్మద్ అలీ జిన్నా చేసిన డిమాండ్ అనుచితమన్న అబ్దుల్లా.. పాక్ భారత్‌లోనే ఉంటే.. ముస్లింలకు 26 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన చోట 39శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చేదన్నారు. జిన్నా చేసిన ఈ ప్రతిపాదనకు అప్పటి కాంగ్రెస్ అంగీకరించలేదని.. అందుకే జిన్నా దేశ విభజనకు మొగ్గు చూపారని అబ్ధుల్లా అభిప్రాయపడ్డారు. జిన్నా తప్పిదంతో జరిగిన ఈ దేశ విభజన వల్ల కశ్మీరీలేకాదు.. భారత్‌లో ఉన్న ముస్లింలు కూడా ఇబ్బందులు పడుతున్నారని అబ్దుల్లా అన్నారు.
అఖండ భారత్ ఒక్కటిగా ఉండి ఉంటే కాశ్మీరీలకు ఈ కష్టాలు ఉండేవి కావన్న అబ్దుల్లా.. అప్పుడు అంతా ఐక్యంగా, సోదరభావంతో ఉండేవారని అన్నారు. భారత్, పాక్ విభేదాల వల్లే ఇప్పుడు మత సమస్యలు పెరుగుతున్నాయని ఫరూఖ్ అబ్దుల్లా అంటున్నారు.