తెలంగాణ‌లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్

N ANJANEYULU
తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు శుక్ర‌వారం  ఉద‌యం 8 గంట‌ల నుంచి  సాయంత్రం 4 గంట‌ల‌కు  నిర్వ‌హించారు.  ఐదు జిల్లాలలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఇవాళ పోలింగ్ నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌ల‌లో ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, కౌన్సిల‌ర్లు అంద‌రూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ప‌లు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ న‌మోదు అయింది. మొత్తంగా పోలింగ్ ముగిసే స‌మ‌యానికి 90 శాతానికి పైగా పోలింగ్ న‌మోదు అయిన‌ట్టు తెలుస్తున్న‌ది. స్థానిక సంస్థల కోటాలో కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లకు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల‌లో ఒక్కో స్థానా‌నికి పోలింగ్ జ‌రిగిన‌ది. పోలింగ్‌ ప్రక్రి‌యను వెబ్‌‌క్యా‌స్టింగ్ చేసారు. డిసెంబ‌ర్  14న  ఇవాళ నిర్వ‌హించిన‌ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్నారు.
ఇవాళ జరిగిన‌ పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలించిన‌ట్ట‌యితే మెద‌క్ జిల్లాలో  96.69 శాతం పోలింగ్ న‌మోదు అయిన‌ది. ఆ త‌రువాత  ఆదిలాబాద్ జిల్లాలో 87.73 శాతం పోలింగ్‌, న‌ల్ల‌గొండ జిల్లాలో 83.63 శాతం పోలింగ్‌, ఖ‌మ్మం జిల్లాలో 79.95 శాతం, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 99.69  శాతం అత్య‌ధికంగా  పోలింగ్ న‌మోదు అయిన‌ది. 6 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఇవాళ ఉద‌యం 8 గంట‌ల నుంచి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తుండ‌డ‌తో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా  భారీ బందోబ‌స్తు మ‌ధ్య 5 జిల్లాల‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు నిర్వ‌హించారు అధికారులు. ముఖ్యంగా టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు బరిలో ఉన్నారు. క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ ర‌వీంద‌ర్‌సింగ్‌, ఆదిలాబాద్‌లో పుష్ప‌రాణి పోటీలో ఉండ‌డంతో  ఈ రెండు స్థానాల‌లో ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా సాగిన‌ట్టు స‌మాచారం. క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం పోలింగ్ కేంద్రాల వ‌ద్ద స్వ‌ల్ప ఉద్రిక్త‌త చోటు చేసుకోవ‌డం మిన‌హా.. ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌రిగిన‌ట్టు తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి శశాంక్‌గోయ‌ల్ ప్ర‌క‌టించారు. మొత్తం 5,326 ఓటర్ల కోసం 37 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో స్వ‌యంగా రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి శ‌శాంక్ గోయ‌ల్ ప‌రిశీల‌న చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: