ఆ జిల్లాలో అధికార పార్టీ నేతల 50-50.. చీకటి ఒప్పందం ఏమిటి..?

MOHAN BABU
ఆ జిల్లాలో అధికార పార్టీ నేతలు 50-50 అంశంపై హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అనుకున్న చోట పోటీకి దారితీయడంతో ఈ చర్చ మరింత రంజుగా మారుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ లో  ఒకటే గుసగుసలు. ఎవరిని కదిపినా 50-50 షేర్ గురించే మాట్లాడుకుంన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బ్యాక్ డ్రాప్ లో తెరపైకి వచ్చిన ఈ సగం సగం వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటోంది గాని అధికార పార్టీ వర్గాల్లో మాత్రం కాక రేపుతోంది. కాగజ్ నగర్ కు చెందిన దండ విటల్ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి. ఆయన నామినేషన్ కార్యక్రమానికి మంత్రి,ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. టికెట్ ఆశించి భంగపడిన వాళ్లు ఆ గుంపులో కలిసిపోయారు.

అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలో ఏకగ్రీవం కావాల్సిన చోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ తప్పడం లేదు.  ఈ ట్విస్టే ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఏకగ్రీవం కాకుండా కొందరు ఎమ్మెల్యేలే తెర వెనుక కథ నడిపించారట. ఉమ్మడి జిల్లాలోని మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క బెల్లంపల్లి నుంచి తప్ప  మిగతా అన్నిచోట్ల నుంచి నామినేషన్లు పడ్డాయి. వీటిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలే ప్రోత్సహించి నామినేషన్ వేయించారని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. టిఆర్ఎస్ కే చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు నామినేషన్ వేసిన వారిలో ఉండడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుందట. ముందు అయితే నామినేషన్ వెయ్యి ఏమైనా వస్తే నీకు సగం, నాకు సగం అంతా నేనే చూసుకుంటాను అని ఎమ్మెల్యేలు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు హైదరాబాద్ నుంచి పార్టీ నేతలు ఆదిలాబాద్ కు వచ్చారట. ఈ 50-50 ఒప్పందాలకు సంబంధించిన ఆడియోలు పార్టీ దూతలకు అందజేశారట. వెంటనే సదరు దూతలు పార్టీ పెద్దలకు ఇక్కడ జరుగుతున్నదంతా చేప్పేసినట్టు తెలుస్తోంది. సగం సగం షేర్ గురించి అభ్యర్థి దండి విటల్ కు కొందరు చెప్పారట.

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆదివాసి సంఘానికి చెందిన పెందూరి పుష్ప రాణి బరిలో ఉండటంతో ఎన్నిక తప్పడం లేదు. అంతా సాఫీగా వెళ్ళిపోయి ఉంటే ఈ 50-50 బయటకు వచ్చేది కాదు. తేడా కొట్టడంతో ముందుగా ఒప్పందాలు చేసుకున్న ఎమ్మెల్యేలలో గుబులు మొదలైందట. అధిష్టానం దగ్గరకు ఎవరి పేర్లు వెళ్లాయి, ఎవరి పై  యాక్షన్ ఉంటుంది, ఎవరి కెరియర్ ఎలా ఉంటుంది అన్న టెన్షన్ లో ఉన్నారట ఎమ్మెల్యేలు. మరి ఈ సగం సగం యవ్వారాలు పార్టీలో ఎలాంటి కాక రేపుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: