బాబోయ్ కరోనా.. 4 నెలల్లో 7 లక్షల చావులు తప్పవట..?
మన పరిస్థితి బాగానే ఉంది కానీ.. కొన్నిదేశాల్లో మాత్రం కరోనా భయంకరంగానే ఉంది. ప్రత్యేకించి యూరప్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఎంతగా విజృంభిస్తోందంటే.. వచ్చే నాలుగు నెలల్లో మరో 7లక్షల కరోనా కాటుకు బలికావచ్చని అక్కడి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి కాటుతో యూరప్‌లోని అనేక దేశాలు గజగజా వణికిపోతున్నాయి. గతంలో ఇండియా, అమెరికా ఇలాగే వణికిపోయాయి. రికార్డు స్థాయి మరణాలు నమోదు చేశాయి. ఇప్పుడు యూరప్ వంతు వచ్చింది.
యూరప్ మొత్తాన్ని ఇప్పుడు కరోనా మేఘాలు కమ్ముకున్నాయి. యూరప్‌లో మొత్తం 53 దేశాలుంటే.. అందులో 49 దేశాల్లో కరోనా పీక్స్‌లో ఉంది. అక్కడి ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఇప్పటివరకు యూరప్‌లోని అన్ని దేశాల్లో 15లక్షల మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే వచ్చే మార్చి నాటికి ఈ సంఖ్య 22లక్షలు దాటుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. అంటే వచ్చే నాలుగు నెలల్లోనే యూరప్‌లో మరో 7 లక్షల మంది కరోనాతో చనిపోతారన్నమాట.
కొన్నిరోజులుగా యూరప్‌లో కరోనా విజృంభిస్తోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రపంచం మొత్తం మీద నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో సగానికి కంటే ఎక్కువ యూరప్ నుంచే ఉంటున్నాయి. తాజాగా ఒక్క వారంలోనే యూరప్‌లో 4 వేల మందికిపైగా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.