ప్రపంచ పెత్తనంపై కన్నేసిన చైనా.. అందుకే ఈ ప్లాన్..?
ఇప్పటికే తయారీ రంగంలో చైనా గుత్తాధిపత్యం ప్రపంచ దేశాలకు అనుభవమే.. ఒక్క చైనా పై ఆధారపడే అనేక దేశాల ఫ్యాక్టరీలు ఆధారపడి ఉన్నాయి. చైనా నుంచి ముడిసరుకు రాకపోతే.. ఎన్నో రంగాలు దెబ్బ తినే ప్రమాదంలో ఉన్నాయి. టెక్నాలజీలోనూ కీలక పాత్ర పోషిస్తున్న చైనా సమర్థ నాయకత్వంతో రోజురోజుకూ తన ప్రాబల్యం పెంచుకుంటోంది. ఇప్పుడు ప్రపంచ దాతగా మారి తన పలుకు బడి పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అన్నిరంగాల్లోనూ ప్రపంచంలో తనదే పైచేయి కావాలని కలలు కంటున్న చైనా.. ఆర్థికంగా, సైనిక పరంగా అమెరికాను అధిగమించేందుకు రెడీ అవుతోంది.
ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదగేందుకు ప్లాన్ చేస్తున్న చైనా.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు అంతర్జాతీయంగా తన పలుకుబడిని పెంచుకునేందుకు ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల్లో తన వాటా పెంచుకుంటోంది. ఉదారంగా అనేక ప్రపంచ సంస్థలకు దానాలు చేస్తోంది చైనా.. ఈ ఏడాది ఇప్పటి వరకూ వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు చైనా చేసిన దానాలు 66 బిలియన్ డాలర్లు దాటిందని నివేదకలు చెబుతున్నాయి.
ఇన్నాళ్లూ ఇలా ప్రపంచ దాతగా జపాన్ ఉండేది.. ఇప్పుడు జపాన్ స్థానాన్ని చైనా ఆక్రమించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వివిధ సంస్థల ద్వారా పేద, మధ్య తరగతి దేశాలకు దాదాపు 200 బిలియన్ డాలర్ల వరకు సాయం చేస్తుంటాయి. ఇప్పుడు ఆ మొత్తంలో ఒక్క చైనా దేశం మాత్రమే 66 బిలియన్ డాలర్లు సాయం చేస్తోంది. మరి ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించాలంటే ఆ మాత్రం ఖర్చు చేయక తప్పదేమో..