ఆ నాలుగు జిల్లాల్లో టీడీపీకి మళ్ళీ గుండు సున్నా తప్పదా!
గత రెండు ఎన్నికల నుంచి నాలుగు జిల్లాల్లో వైసీపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2014లో కాస్త టీడీపీ గాలి వల్ల కొన్ని సీట్లు గెలుచుకోగలిగింది గానీ, పూర్తి ఆధిక్యం వైసీపీదే. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో టీడీపీకి గుండు సున్నా మిగిలింది. ఇక చిత్తూరులో ఒక కుప్పంలో మాత్రం చంద్రబాబు గెలిచారు.
అయితే ఇప్పటికీ ఆ జిల్లాలో వైసీపీ హవా స్పష్టంగా నడుస్తోంది. స్థానిక ఎన్నికల్లో సైతం వైసీపీ క్లీన్‌స్వీప్ చేసినంత పనిచేసింది. తాజాగా కొన్ని స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ డామినేషన్ నడిచింది. నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర కార్పొరేషన్‌లో క్లీన్‌స్వీప్ చేసింది. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని వైసీపీ దక్కించుకుంది.
ఇక చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ సత్తా చాటింది. టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీ జెండా ఎగిరింది. ఇటు కర్నూలులోని బేతంచెర్ల మున్సిపాలిటీలో సైతం వైసీపీనే గెలిచింది. అలాగే కడప జిల్లాలోని రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీలని వైసీపీ తిరుగులేని మెజారిటీలతో గెలుచుకుంది.
ఇక తిరుపతి పార్లమెంట్, బద్వేలు ఉపఎన్నికల్లో భారీ మెజారిటీలతో గెలిచిన విషయం తెలిసిందే. అంటే ఈ నాలుగు జిల్లాలో వైసీపీ ఎంత బలంగా ఉందో...టీడీపీ ఎంత వీక్‌గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదే పరిస్తితి కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాల్లో టీడీపీకి ఒక సీటు కూడా వచ్చేలా లేదు.