ప్రాజెక్టులకు పోటెత్తిన వరద.. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్త...!
నెల్లూరు జిల్లా లో నదులు ఉగ్రరూపం దాల్చాయి. జల ప్రళయం సమీప గ్రామాలను ముంచెత్తుతోంది. జిల్లాలో పెన్నానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదీ సమీప గ్రామాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. వెంగమ నాయుడుపల్లి, బండారుపల్లి, వీర్లగుడిపాడు, నడిగడ్డ అగ్రహారంలను వరద ప్రవాహం చుట్టుముట్టింది. ఇక ఉపనదులు కొమ్మ లేరు, కేతా మన్నేరు, బొగ్గేరు, బీరాపేరు, నల్లవాగు అంతకంతకు పొంగుతోంది. సోమశిల జలాశయం నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు విడుదలైంది. పెన్నా నది లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు ఆనకట్ట దగ్గర దాదాపు 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. స్వర్ణముఖి, కాలంగి, పంబలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నేషనల్ హైవేపైకి వరద నీరు చేరుతోంది.
ఇక కడప జిల్లా సుండుపల్లి మండలంలోని పింఛా ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 5గేట్లు ఎత్తి 48వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ కట్ట తెగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. దీంతో దిగువన ఉన్న అన్నమయ్య ప్రాజెక్ట్ భద్రతపై అధికారులు అలర్ట్ అయ్యారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మొత్తానికి నెల్లూరు జిల్లాను వరదలు ముంచెత్తాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడమే కాదు.. దిగువకు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు.