అచ్చెన్న..బాబు భలే దెబ్బకొట్టారే!

M N Amaleswara rao
ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడుకు అనుకున్న మేర ప్రాధాన్యత దక్కడం లేదని తెలుస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నా సరే ఆయన్ని కొంతవరకే పరిమితం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకో చంద్రబాబు, అచ్చెన్నకు అనుకున్న విధంగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అచ్చెన్నకు కుప్పం బాధ్యతలు అప్పగించకపోవడం బట్టి చూస్తే, ఎక్కడో అచ్చెన్నపై బాబుకు నమ్మకం తగ్గిందని తెలుస్తోంది.
చంద్రబాబు కంచుకోట కావడంతో వైసీపీ, కుప్పం మున్సిపల్ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా అక్కడ గెలవాలనే లక్ష్యంతో పనిచేసింది. అధికార బలాన్ని పూర్తిగా పెట్టి కుప్పంలో సత్తా చాటాడానికి ప్రయత్నించింది. కుప్పంలో వైసీపీని నిలువరించడానికి టీడీపీ గట్టిగానే ట్రై చేసింది. ఎన్నికల ముందు చంద్రబాబు రెండురోజులు కుప్పంలో తిరిగారు. అలాగే రెండురోజులు నారా లోకేష్ ప్రచారం చేశారు. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతలు కుప్పంలోనే మకాం వేశారు.
అయితే కుప్పం ప్రధాన బాధ్యతని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు అప్పగించారు. ఆయనే అన్నీ అక్కడ దగ్గర ఉండి చూసుకున్నారు. పోలింగ్ అయ్యేవరకు అక్కడే ఉన్నారు. అయితే కీలకమైన కుప్పంలో కాకుండా అచ్చెన్నని నెల్లూరు కార్పొరేషన్‌ బాధ్యతలు అప్పగించారు. అయితే అక్కడ ఎలాగో వైసీపీ హవా ఉంది. దీంతో అచ్చెన్న పెద్దగా కార్పొరేషన్‌ని పట్టించుకోలేదు.
అంటే కుప్పం బాధ్యతలు అచ్చెన్నకు కాకుండా నిమ్మలకు ఎందుకు అప్పగించారనేది క్లారిటీ లేదు. కాకపోతే అచ్చెన్నపై బాబుకు నమ్మకం లేనట్లే కనిపిస్తోంది. ఇలా అచ్చెన్నకు ప్రాధాన్యత తగ్గించడం వెనుక కారణాలు లేకపోలేదని తెలుస్తోంది.  తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా పార్టీ గురించి, నారా లోకేష్ గురించి అచ్చెన్న చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. నేతలతో అంతర్గతంగా మాట్లాడినప్పుడు అచ్చెన్న..లోకేష్‌ని ఉద్దేశించి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అక్కడ నుంచి అచ్చెన్నని చంద్రబాబు నమ్ముతున్నట్లు కనిపించడం లేదు. మొత్తానికైతే అచ్చెన్నకు బాబు సైలెంట్‌గా దెబ్బవేసేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: