కృష్ణాలో వైసీపీ దూకుడు...రెండుచోట్ల టీడీపీకి షాక్?
కృష్ణాలోని అన్నీ మున్సిపల్, కార్పొరేషన్ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఆ తర్వాత జరిగిన ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసినంత పనిచేసింది. ఇక తాజాగా జిల్లాలో జరుగుతున్న కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో కూడా వైసీపీ హవానే నడుస్తుందని అర్ధమవుతుంది. ఏ మాత్రం డౌట్ లేకుండా రెండుచోట్ల వైసీపీ గెలుపు ఖాయమని విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ పూర్తిగా పోటీ ఇవ్వలేకపోతుంది. పైగా వైసీపీకి ధీటుగా టీడీపీ ఆర్ధికంగా వీక్ అయింది..దీంతో టీడీపీ అభ్యర్ధులు ప్రజలని ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నారు.
ఇటు కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో టీడీపీని వైసీపీకి ధీటుగా నిలబెట్టడంతో మాజీ మంత్రి దేవినేని ఉమా ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. ఏదో అన్నీ వార్డుల్లో అభ్యర్ధులని నిలబెట్టారు గానీ, పూర్తి స్థాయిలో మాత్రం వారికి అండగా ఉండటంలో ఉమా వెనుకబడి ఉన్నారు. అటు జగ్గయ్యపేట మున్సిపాలిటీలో సైతం మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఎఫెక్టివ్‌గా లేరు.
కానీ రెండు చోట్ల వైసీపీ నేతలు దూకుడుగా ఉన్నారు. ఇటు కొండపల్లిలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్...అభ్యర్ధులకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఆర్ధికంగా అండదండలు అందిస్తున్నారు...అటు జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం అభ్యర్ధులకు అండగా ఉన్నారు. ఇక జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు కొండపల్లి, జగ్గయ్యపేటల్లో మకాం వేసి పార్టీని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలని బట్టి చూస్తే రెండుచోట్ల టీడీపీకి గట్టి షాక్ తగిలేలా ఉంది.