ఏపీ, తమిళనాడుకు రెడ్ అలర్ట్.. ఎవరూ బయటకు రాకండి..!

NAGARJUNA NAKKA
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లను ఈదురుగాలులు, భారీ వర్షాలతో ముంచెత్తుతోంది. నేడు తుపాను తీరం దాటనున్న కారణంగా.. ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో రెడ్ అలర్ట్ విధించారు. అత్యవసర పనులుంటేనే కానీ ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక తుపాను కొద్ది గంటల్లో తమిళనాడులోని కరైకర్, ఏపీలోని శ్రీహరి కోట దగ్గర ఉన్న కడలూరు సమీపంలో తీరం దాటనుంది.  

కుండపోత వర్షాలకు తమిళనాడు చిగురుటాకులా వణుకుతోంది. ధాటిగా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించిపోయింది. ఎటు చూసినా వరద ఉప్పొంగుతోంది. వర్షాల కారణంగా గత నాలుగు రోజుల్లో 91మంది మృత్యువాత పడినట్టు అధికారులు ప్రకటించారు. చెన్నై, చెంగల్ పట్టు, తిరువళ్లూర్, కాంచీపురం, విల్లుపురం ప్రాంతాల్లో ఇళ్లు, ఆసుపత్రుల్లోకి నీరు చేరింది. చెన్నై కేకే నగర్ లోని ఈఎస్ఐ హాస్పిటల్ పూర్తిగా జలమయమైంది.

రానున్న నాలుగు గంటల్లో చెన్నై, తిరువల్లూర్ లో అతి భారీ వర్షాలు పడనున్న కారణంగా తమిళనాడు ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై లోని అన్ని సబ్ వేలను మూసివేయాలని.. మరో రెండు రోజుల పాటు ప్రజలు నిత్యావసరాలను అందుబాటులో ఉంచుకోవాలని.. బయటకు రావొద్దని ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది.

మరోవైపు తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని చెన్నైలో భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం, అధిారులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ ఇన్ స్పెక్టర్ రాజేశ్వరీ చేసిన పని అందరితో శెభాష్ అనిపించుకుంటోంది. అనారోగ్యంతో శ్మశానవాటికలో అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని తన భుజాలపై వేసుకొని ఆస్పత్రికి ఆమె తరలించింది. ఆ వీడియోలు వైరల్ గా మారాయి. అందరూ ఆ మహిళా పోలీస్ ను ఫ్రశంసిస్తున్నారు. మొత్తానికి తమిళనాడు భారీ వర్షాలతో చిగురుటాకులా వణికిపోతోంది.









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: