హుజురాబాద్ ఎన్నికలు అయిపోయాయి. అయిపోయాక కూడా వాటి పై మాట్లాడడం అన్నది సబబు కాదంటే ఎలా? వేల కోట్ల రూపాయలు ఖర్చయిపోయాయి. అయిపోయాక కూడా వాటి గురించి ఆలోచించనే వద్దు అంటే ఎలా. ఏదేమయినా హుజురాబాద్ అన్నది హాయిగా సాగాల్సిన ఎన్నిక. కోట్లకు పని లేని ఎన్నిక. కానీ కేసీఆర్ తనదైన శైలిలో హీటు పెంచి ఎక్కడెక్కడి మనుషులనో తన చెంతకు చేర్చాడు. అక్కున చేర్చుకున్నాడు. ఆయా పార్టీల నాయకులు చేరిన ప్రతిసారీ తనని తాను పొగుడుకుని, ఇతర పార్టీలను తిట్టాడు. దీంతో ఆ తిట్లను విన్న రేవంత్ రెడ్డి లాంటి బహు పరాక్రమశాలులు స్పందించారు. ఇలానో ఎలానో రాజకీయం రభసగా మారిపోయింది. అయినా కూడా హుజురాబాద్ ఎన్నిక కేసీఆర్ కు వరం లాంటిదే అయింది. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మి చెడాలి అన్నది కూడా ఆయనకు అర్థం అయ్యేలా లేదా అర్థం అయ్యేందుకు అవకాశమో ఆస్కారమో దక్కేలా చేశాయి.
ఇవన్నీ బాగున్నాయి ఇప్పుడు మళ్లీ కేసీఆర్ టెన్షన్ లో పడ్డాడు. డైలమాలో పడ్డాడు. తాను ఆశించిన విధంగా పార్టీ నాయకులు పనిచేయకున్నా కూడా రాబోవు కాలంలో కొన్ని గంధర్వ వీణలు మోగాలంటే విజయ తీరాలకు చేరాలంటే వారే ముఖ్యం కదా! అందుకు తన వారికే ఎమ్మెల్సీలు అని అంటున్నాడు కేసీఆర్. మరి! పక్క పార్టీల నుంచి వచ్చిన వారి గతేం కావాలి?
ద సీనియర్ మోస్ట్ తుమ్మలకు ఈ సారి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఖాయం అని తేలిపోయింది. ఈ మాట ఆయన అంటున్నా డు. లేదా ఆయన వర్గాలు అంటున్నాయి. లేదంటే ఆయన రేవంత్ రెడ్డి పిలుపు అందుకుని కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం గా ఉన్నాడు. ఇంకా వీలుంటే వైఎస్సార్టీపీలోనో బీజేపీలోనో (చంద్రబాబు సూచనలు పాటించి) చేరిపోయినా చేరిపోవచ్చు. అదే గనుక జరిగితే టీఆర్ఎస్ లో మరో ముసలం రావొచ్చు. తుమ్మల వర్గం ఖాళీ చేస్తే ఉమ్మడి ఖమ్మంలో పార్టీ గతేం కాను. మరోవైపు వ్యక్తిగతంగా ప్రజలలో మంచి పేరున్న లేదా పలుకుబడి ఉన్న నేతలను ఆకర్షించేందుకు బీజేపీ ఇప్పటికే తన ప్లాన్ ను వర్కౌట్ చేస్తోంది. ఈ క్రమంలో తుమ్మల వెళ్లాడే అనుకోండి ఇంటి పార్టీ తాలుకా ఇంటి గుట్టు అంతా లీక్ కావడం ఖాయం. కనుక ఆయనకు ఎమ్మెల్సీ గ్యారంటీ భయ్యా! ఎప్పటిలానే ఆయన పదవి అందుకుంటే ఆ భాగ్యం చూసి ఇతర పార్టీల నుంచి హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే ఇక్కడికి చేరిన ఎల్ రమణ కానీ లేదా మోత్కుపల్లి, ఇనగాల పెద్దిరెడ్డి కానీ ఏం కావాల?