జగన్ ని సైలెంట్ గా ఫాలో అవుతున్న బీజేపీ సీఎం

Deekshitha Reddy
ఆంధ్ర ప్రదేశ్ లో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పధకాలను అమలుచేస్తున్నారు. వినూత్నంగా ఆలోచిస్తూ పధకాలను ప్రజల ఇళ్ల వద్దకే తీసుకెళ్తున్నారు. దశాబ్దాల తరబడి వ్యవస్థలోని లోపాలని సవరిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి.. ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తున్నారు. వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్ కూడా ఇంటివద్దనే అందిస్తున్నారు. అదే విధంగా గంటల తరబడి రేషన్ షాపుల వద్ద వేచి ఉండే విధానాన్ని రద్దు చేసి.. ఇళ్ల వద్దకే సరుకుల పంపిణీని ప్రారంభించారు. అయితే ఇప్పుడు జగన్ ఫార్ములాను బీజేపీ నేతలు కూడా ఫాలో అవుతున్నారు.
తాజాగా కర్ణాటకలో సీఎం బసవరాజ బొమ్మై కూడా జగన్ పాలనకు తామూ అనుసరిస్తున్నట్టు చెప్పారు. అధికారం విధానసౌధకే పరిమితం చేయకుండా.. సచివాలయ తరహా పాలన అందించేందుకు శ్రీకారం చుడతామన్నారు. పంచాయితీ కార్యాలయాల్లోనే ప్రజలకు అన్ని సేవలు లభ్యమయ్యేలా పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. వీటితో పాటు ఏపీలో అమలవుతున్న ఇంటింటికీ రేషన్ పధకాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏపీలో ఈ పధకం అమలవుతున్న తీరును కర్ణాటక పౌరసరఫరాల శాఖ అధికారులు పరిశీలించినట్టు సమాచారం. జనవరి 26న ఈ కార్యక్రమాలన్నిటినీ అమలుచేసేలా ఇప్పటికే అధికారులను ఆదేశించినట్టుగా కూడా తెలుస్తోంది.
కర్ణాటకలో ప్రజాపంపిణీ వ్యవస్థను ఇప్పటికే పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేసేశారు. కాబట్టి ఇళ్లవద్ద సరుకులు పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఉండవని అధికారులు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. జనవరి తర్వాత కర్ణాటకలోనూ.. ఏపీలో మాదిరిగానే ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి..సరుకులను పంపిణీ చేస్తారు. వీటితోపాటు వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్ కూడా ఇళ్లవద్దనే అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసింది. ఓవైపు ఏపీలో జగన్ పథకాలను ఇక్కడి బీజేపీ నేతలు విమర్శిస్తుండగా.. పక్క రాష్ట్రంలోని అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. జగన్ పథకాలను, పాలనను ఫాలో అవడం విశేషమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: