హుజూరాబాద్‌: ప్రచారానికి బీజేపీ హేమాహేమీలు!?

Chakravarthi Kalyan
హూజూరాబాద్‌ ఉపఎన్నిక పోరు సందర్భంగా ప్రధాన పార్టీలు జోరు పెంచుతున్నాయి. పోలింగ్‌కు సమయం ముంచుకొస్తుండటంతో చివరి రోజుల్లో ప్రచారం ఉధృతం చేయబోతున్నాయి. హుజూరాబాద్‌ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తోంది. రాష్ట్రంలోని కీలకనేతలందరినీ హుజూరాబాద్‌లోనే మోహరిస్తోంది. ప్రచారానికి స్టాక్ క్యాంపెయినర్లను తీసుకొస్తోంది.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రేపటి నుంచి ఈటల రాజేందర్‌ తరపున కీలక నేతలు ప్రచారం చేయనున్నారు. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌ రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు జమ్మికుంట రూరల్ మండలంలో పర్యటించబోతున్నారు. అక్టోబర్ 21న హుజూరాబాద్ రూరల్ మండలం, 22న కమలాపూర్ మండలంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇక భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీఅభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున ప్రచారం నిర్వహిస్తారు. ఎల్లుండి మాజీ ఎంపీ, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఈటల రాజేందర్ తరఫున ప్రచారం చేయబోతున్నారు. ఈ నెల 22,23 తేదీల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఈటల రాజేందర్ తరఫున ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ నెల 22న జమ్మికుంట పట్టణంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ప్రచారం నిర్వహిస్తారు.  వీణవంక మండలంలో ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌, హుజురాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ప్రచారం చేస్తారు. ఈ నెల 22న కమలాపుర్ మండలంలో బండి సంజయ్ తో పాటు మాజీ మంత్రి బాబుమోహన్ ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి హుజూరాబాద్‌ కోసం బీజేపీ తన బలగాలన్నీ మోహరిస్తోంది. మరోవైపు అధికార పార్టీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఉపఎన్నికను తీసుకుంది. మరి ఇక్కడ ఈటల ఈటె దూసుకుపోతుందా.. కారు పంక్చర్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: