కరెంట్ కోతలపై ఏపీ మంత్రి స్పందన.. ఆయన ఏమన్నారంటే...?

NAGARJUNA NAKKA
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో లోడ్ రిలీఫ్ పేరిట గంటల కొద్దీ కరెంట్ కోతలు ఉంటాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. గ్రామాల్లో సాయంత్రం 6గంటల నుంచి 10గంటల వరకు, పట్టణాల్లో రాత్రి 9గంటల నుండి అర్ధరాత్రి 12గంటల వరకు, నగరాల్లో రాత్రి 11గంటల నుండి 3గంటల వరకు కోతలుంటాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక  టీడీపీ నేత లోకేశ్ కూడా తనదైన శైలిలో విమర్శలు మొదలు పెట్టారు. ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్ ఆగిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని జగన్ అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం మోపుతూ.. కరెంట్ కోతలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోవాలని లోకేశ్ అన్నారు.
కరెంట్ కోతలపై మంత్రి బాలినేని శ్రీనివాస్ స్పందించారు. బొగ్గు కొరత వల్లే విద్యుత్ సమస్య ఏర్పడిందని స్పష్టం చేశారు. ఒక్క ఏపీలోనే కాదనీ.. అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య ఉందని తెలిపారు. యూనిట్ 20రూపాయలకు కొని.. విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ కోతలు ఉండవని స్పష్టం చేశారు. ఎక్కువ ధరలకు పీపీఏలు చేసుకొని టీడీపీ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని.. సోలార్ పవర్ కొనుగోలు చేయకుండా అడ్డుకుందని ఆరోపించారు.
మొత్తానికి ఏపీని కరెంట్ కోతలు వేధిస్తున్నాయని తెలుస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా కరెంట్ కట్ లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఈ సమస్యను అధిగమించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. బొగ్గు సరఫరాను థర్మల్ పవర్ స్టేషన్లను అందించి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే జగన్ కూడా ఈ సమస్యపై సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో ఆర్థిక పరంగా వెనుకడుగు వేయొద్దని అధికారులకు సూచించారు.








మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: