
తిరుమలపై సుప్రీంకోర్టులో టీటీడీ అఫిడవిట్.. ఏం చెప్పిందంటే..?
ఇదే సమయంలో అసలు ఈ కైంకర్యాలు ఎలా ప్రారంభమయ్యాయి.. ఎలా కొనసాగుతున్నాయో వివరింగా తెలిపింది టీటీడీ. 10 వ శతాబ్దంలో శ్రీరామానుజాచార్యులు ప్రారంభించిన ఆగమశాస్త్రం ప్రకారమే శ్రీవారికి సేవలు, ఉత్సవాల నిర్వహణ జరుగుతున్నాయని టీటీడీ చెప్పింది. దాదాపు వెయ్యేళ్లుగా ఈ పరంపర కొనసాగుతోందని చెప్పింది. మతపరమైన సిబ్బంది, ఆలయంలోని ఇతర పూజారులు ద్వారా అత్యంత ఆత్మీయత, విశ్వాసం, భక్తి శ్రద్ధలతో ఆచారాలు నిర్వహిస్తున్నామని టీటీడీ తన అఫిడవిట్ లో స్పష్టం చేసింది.
పూజలు, కైంకర్యాల విషయంలో అర్చకులను మార్గనిర్దేశం చేయడానికి, మతపరమైన విషయాల్లో టీటీడీకి సలహాలు ఇవ్వడానికి వైఖానస ఆగమంలో అనుభవజ్ఞులైన పండితులతో ఆగమ సలహా కమిటీ ఏర్పాటు చేస్తోందని టీటీడీ అఫిడవిట్‌లో చెప్పింది. ఆచార వ్యవహారాలు నిర్వహించడంలో పండితులను పెద్దజీయంగార్ పర్యవేక్షిస్తారని టీటీడీ చెప్పింది. ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులు పెద్ద జీయంగార్ సలహాలు సూచనలు పాటిస్తారని తెలిపింది.
అయితే పిటిషన్ వేసిన భక్తుడు.. ప్రతి శుక్రవారం శ్రీవారికి ఎలాంటి వస్త్రాలంకరణ లేకుండా అభిషేక సేవ చేస్తున్నారని తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ ఆరోపణలను టీటీడీ పూర్తిగా ఖండించింది. ఆ వేళల్లో కౌపీనం అనే తెల్లని వస్త్రాన్ని కప్పి పాలతో అభిషేకం చేస్తారని తెలిపింది. ఇదంతా పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయ వైఖానస ఆగమం ప్రకారమే జరుగుతోందని టీటీడీ తెలిపింది. ఆర్జిత బ్రహ్మోత్సవ వేళల్లో శ్రీవారిని మాడ వీధుల్లో ఊరేగించడం లేదన్న ఆరోపణపైనా టీటీడీ వివరణ ఇచ్చింది.