దూదికి కూడా దిక్కులేని జగన్ ఆస్పత్రి ?
విచిత్రం అయిన పరిస్థితుల్లో పాలన సాగుతోంది. ఆస్పత్రుల దయనీయతలపై ఎవ్వరూ స్పందిచని వైనం ఒకటి వెలుగు చూస్తోంది. కరోనా సమయంలోనే మన వైద్య ఆరోగ్య శాఖ డొల్లతనం ఎంతన్నది తేలిపోయినా, అతి కష్టం మీద నాటి సమస్యల నుంచి జనం కోలుకున్నారు. అందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు సాయం అందించాయి. ఇప్పుడు ఆ విపత్కర కాలాన్ని మరిచిపోయి, ఆస్పత్రుల నిర్వహణకు కనీస ఛార్జీల విడుదలకు కూడా జగన్ కు మనసు రావడం లేదన్న ఆరోపణ ఒకటి వినిపిస్తూ వస్తోంది.
కరోనా తీవ్రత తగ్గి, ఇతర వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యం ఎలా ఉంది. చిన్న చిన్న శస్త్ర చికిత్సల కోసం వచ్చే వారికి సైతం చుక్కలు కనపడుతున్నాయన్నది నిజమేనా? ఈ తరుణాన ఆస్పత్రుల బాగు కోసం నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమయినా చర్యలు తీసుకుందా ? ఇవన్నీ ఆలోచించదగ్గ ప్రశ్నలే! అయినప్పటికీ ప్రభుత్వం తీరు మరోలా ఉంది లేండి. వాళ్లకు డబ్బులు పంచడం తప్ప ఆస్పత్రుల బాగు కోసం నిధులు ఇవ్వడం తెలియదు అన్నది విపక్షం చేస్తున్న ఆరోపణ. ఎక్కడికక్కడ నిధులు ఆపేసి, ఆరోగ్య శ్రీ నిధులు సైతం సరిగా విడుదల చేయక ఉన్న డబ్బంతా పథకాలకే ఇస్తుండడంతో చిన్న చిన్న దవఖానాలు కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో శస్త్ర చికిత్సలకు అవసరం అయ్యే మెటీరియల్ ను కూడా రోగుల తోనే కొనుగోలు చేయాల్సి వస్తుందన్న ఆవేదన రోగుల నుంచి వినిపిస్తోంది. ప్రధాన మీడియా లో వీటిపై కథనాలు వచ్చినా ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టని విధంగా ఉంటోంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల పేరిట డబ్బులు వెదజల్లుతున్న జగన్ సర్కారుకు బోధనా ఆస్పత్రులకు, ఆస్పత్రులకు నిధులు ఇవ్వడంలో మాత్రం అస్సలు మనసే రావడం లేదు. ఏటా కేటాయించాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదు. దీంతో చిన్న చిన్న వస్తువుల కొనుగోలు కూడా వీరికి సాధ్యం కావడం లేదు. సర్జరీలకు సంబంధించి సూది,దారం, మత్తుమందు, స్పిరిట్ ఇలాంటి చిన్న, చిన్న వస్తువుల కొనుగోలుకు సైతం డబ్బుల్లేవనే తెలుస్తోంది. ప్రభుత్వం పైకి చెప్పిన మాటకూ, లోపల దాచిన మాటలకూ తేడా వేర్వేరుగా ఉంది. కరోనా కారణంగా కాస్తో కూస్తో నిధులిచ్చాక, అటుపై ఆస్పత్రులకు సొమ్ముల విడుదల అన్నది లేనేలేదు. దీంతో చాలా చోట్ల క్షేత్ర స్థాయిలో సమస్యలు నెలకొంటున్నాయి. శస్త్ర చికిత్సలకు సంబంధించిన సరంజామా కొనుగోలకు నిధులు 127 కోట్లు కావాలని అడిగితే కేవలం 20 కోట్లు వెచ్చించి సైలెంట్ అయిపోయింది వైఎస్సార్సీపీ సర్కారు. ఇదే విధంగా గతంలోనూ ప్రభుత్వాలు ఉన్నాయా అంటే ఇప్పటి కన్నా గతంలో కాస్త మెరుగ్గానే నిధులు విదిల్చాయని గణాంకాలు వెల్లడిస్తున్న మాట.