ప్రకాశం జిల్లా కొండపి నుంచి వరుస విజయాలు సాధిస్తున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.. డోలా బాల వీరాంజనేస్వామి. రాజకీయాలకు పూర్వం.. ఆయన ప్రభుత్వ వైద్యునిగా.. సేవలందించారు. అయితే.. చంద్రబాబు పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2014లో కొండపి నుంచి తొలి విజయం నమోదు చేశారు. ఇక, గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ సునామీ ఉన్నా.. వైసీపీ హవా నడిచినా.. డోలా విజయం దక్కించుకున్నారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతున్నారు. అయితే.. గతంలో చంద్రబాబు హయాంలో నియోజకవర్గంలో కమ్మ వర్గం.. ఒకింత రుసరుసలాడినా.. వారిని కూడా కలుపుకొని పోయారు.
ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో డోలా.. ఎవరూ ఊహించని విధంగా విజయం దక్కించుకున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో.. టీడీపీ తుడిచి పెట్టుకుపోగా.. డోలా మాత్రం పట్టు నిలుపుకొని.. టీడీపీ పరువు కాపాడడంతోపాటు.. తన సత్తాను కూడా నిరూపించుకున్నారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు అన్నింటిలోనూ టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. ఒక్క కొండపిలో మాత్రమే స్వామి గెలిచారు. ఇక ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లోను.. పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించడంలోనూ.. స్వామి ముందుంటున్నారు. అటు అసెంబ్లీలోనూ బలమైన గళం వినిపిస్తున్నారు.
చంద్రబాబు పిలుపు మేరకు ఆయన పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ.. అందరితోనూ శభాష్ స్వామీ! అని అనిపించుకుంటున్నారు. మరోవైపు.. గతంలో ఉన్న వ్యతిరేకత... గ్రూపు రాజకీయాలను కూడా స్వామి పక్కన పెట్టారు. ఈ పరిణామా లతో స్వామి గ్రాఫ్ జోరందుకుందనే వాదన వినిపిస్తోంది. అదే సమయంలో ప్రకాశంలోని ఇతర టీడీపీ ఎమ్మెల్యేలతోనూ అవినాభావ సంబంధాలను ఏర్పాటు చేసుకుని.. పార్టీ తరఫున, జిల్లా ప్రజల సమస్యల తరఫున కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు అండగా ఉంటున్నారు. పార్టీ కార్యకర్తలను కలుపుకొని పోతున్నారు. ముఖ్యంగా రైతాంగ సమస్యలపై నిత్యం ప్రజలతో ఉంటూ.. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
అన్నింటికన్నా మిన్నగా.. పార్టీలో వర్గ పోరు లేకుండా చూసుకోవడం.. దూకుడు పెంచడం.. వాయిస్ వినిపించడం వంటి విషయాల్లో ఎమ్మెల్యే స్వామి పుంజుకున్నారని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు ఏర్పడితే.. ఎస్సీ సామాజిక వర్గం తరఫున కేబినెట్‌లో స్వామికి బెర్త్ ఖాయమని అంటున్నారు పరిశీలకులు. అయితే.. దీనికి సంబంధించి.. ఇప్పుడున్న రేంజ్‌ను మరింత పెంచాలని మరింత దూకుడుగా వాయిస్ వినిపించాలని చెబుతున్నారు. మరి స్వామి ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా.. రాష్ట్రంలో టీడీపీ తరఫున మాల సామాజిక వర్గంలో బలమైన వాయిస్ వినిపిస్తున్న నాయకుడు.. డోలా అనడంలో సందేహం లేదని అంటున్నారు సీనియర్లు కూడా..!