ఆర్ ఆర్ ఆర్ పై కొండపొలం ప్రభావం ?
ప్రతిష్టాత్మక చిత్రాలకు ప్రతిష్టాత్మక రీతిలో సంగీతం అందించడం సాహసం. సవాలుతో కూడిన పని కూడా! కానీ ఆయన మాత్రం ఇవేవీ పట్టించుకోరు. ఆయన దగ్గర ట్యూన్ బ్యాంక్ నుంచి ఏవో ఒకటో అరో బయటకు తీసి అటు ఇటు కలిపి సంగీతం అనే పేరుతో , కీరవాణి మ్యూజికల్ అనే బ్రాండ్ ఇమేజ్ తో నెగ్గుకు వచ్చేందుకు తెగ తాపత్రయపడుతున్నారు.ఇదే ఇవాళ ఆయనకు మైనస్ .. కొడుకు కాలభైరవ ఓ వైపు పాటలు పాడుతున్నారు. ఆ మాటకు వస్తే ఆయన కూడా మంచి సంగీత దర్శకుడిగా ఏ పేరూ తెచ్చుకోలేదు అనుకోండి. మరోవైపు సౌండ్ సూపర్ విజన్ అని తమ్ముడు కల్యాణీ మాలిక్ ఉన్నారు.. వీళ్లిద్దరూ కూడా ఆయన మూసని అడ్డుకోలేకపోతున్నారు. నిర్మాతలూ అడగలేకపోతున్నారు.కేవలం రాజమౌళీ సినిమాలకే మీరు మంచి సంగీతం ఇస్తారా అన్న ప్రశ్నకు ఆయన చెప్పే జవాబు ఎలా ఉన్నా, ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కు ఆయన పెట్టిన శ్రద్ధ ఏమీ లేదని మొన్నటి దోస్తీ పాటతోనే తేలిపోయింది.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై కొండ పొలం ప్రభావం ఉంటుందా అంటే ఔననే అంటున్నాయి చిత్ర పరిశ్రమకు చెందిన కొన్ని వర్గాలు. కొండ పొలం సంగీతం ఏమీ బాలేదని, ఆయన స్థాయిలో సంగీతం అందించలేదని, ఇప్పుడిదే ఆర్ ఆర్ ఆర్ పై కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే విడుదలయిన దోస్తీ పాట పెద్దగా పేరు తెచ్చుకోలేదు. ఓ వైపు యువ సంగీత దర్శకులు మంచి పాటలతో, నేపథ్య సంగీతంతో రాణిస్తుంటే కీరవాణి మాత్రం ఇంకా ఆ పాత పద్ధతులతోనే కాలం వెళ్ల దీస్తున్నారు అన్న విమర్శలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ఒక సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే సంగీతం ఇంకా పాత అరిగిపోయిన రికార్డులతోనో, కాపీ పేస్టు రాగాలతోనో కాలం వెళ్లదీస్తుడడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. అదేవిధంగా ఆయన అందిస్తున్న పాటలు, వాటి నడక అన్నీ పదే పదే గత చిత్రాలను పోలి ఉండడంతో సంగీతాభిమానులు తలలు పట్టుకుంటున్నారు. సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా ఆయన గొంతెక్కటే మోత మోగిస్తుండడంతో ప్రేక్షకుల అసహనానికి మరో కారణం.