రాష్ట్ర ఆర్థిక శాఖ,వైద్య శాఖ మంత్రిగా పనిచేసికోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆ డబ్బుతోనే ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. శుక్రవారం హుజురాబాద్ సిటీ సెంటర్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ, బీసీ ల భూములు కబ్జా చేసిన ఈటెల రాజేందర్ నిజ స్వరూపం పూర్తిగా తెలిసిపోయిందన్నారు. రైతులకు, కార్మికులకు వ్యతిరేకంగా పనిచేసే బిజెపి పార్టీలో చేరిన ఈటల రాజేందర్ గుజరాతీలకు పచ్చి బానిస అన్నారు. బిజెపిలో ఆస్తుల రక్షణకే చేరారని, ఢిల్లీ పార్టీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. బిజెపితో హుజురాబాద్ కు, రాష్ట్ర ప్రజలకు ఏం లాభం జరుగుతుందో చెప్పాలన్నారు.
కోచ్ ఫ్యాక్టరీ తెస్తావా, కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రంతో మాట్లాడి హోదా ఇప్పిస్తావా చెప్పాలన్నారు. డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గిస్తావా చెప్పాలని డిమాండ్ చేశారు . ఈటెల రాజేందర్ ఓటమి ఖాయమని,గెల్లు గెలుపును ఎవరూ ఆపలేరని జోస్యం చెప్పారు. ఉద్యమకారుడు, అసలైన బిసి బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కడిగిన ముత్యమని,ఈటల మాదిరిగా ఎలాంటి మరకలు లేవన్నారు. రోజురోజుకు వలసలు పెరిగిన కొద్దీ ఈటెల లో అసహనం,వెన్నులో వణుకు మొదలైందని టిఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఈ నెలలో 13,14 తేదీల్లో దసరా పండుగ సందర్భంగా ఈటెల రాజేందర్ డ్రామా రాజకీయాలు చేసే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చింది అన్నారు. తనకు తానే కారు పై దాడులు చేసుకొని,టీఆర్ఎస్ పై నెట్టే నాటకం మొదలు పెట్టే అవకాశం తో పాటు సానుభూతిని పొందేందుకు కుట్ర చేస్తున్నట్లు తెలిపారు.
దాడిలో గాయపడ్డట్లు చిత్రీకరణ చేసి, వీల్ చైర్ లో కూర్చుండి, ఆయన భార్యతో పెద్ద నాటకమాడి డ్రామాలకు తెరలేపుతున్నట్టు తమకు సమాచారం వచ్చిందని బాల్కసుమన్ ఆరోపించారు. ఈటెల రాజేందర్ గెలిస్తే హుజురాబాద్ కు ఏం రావన్నారు. బయటి నాయకులు టిఆర్ఎస్ నాయకులను విమర్శలు చేస్తున్నారని,మరి బిజెపి నుండి ప్రచారంలో ఉన్న నేతలు ఎక్కడి వారో చెప్పాలని అన్నారు. కమలాపురం మండలంలోని అన్ని గ్రామాల్లో రాబోయే రోజుల్లో బిజెపి అడ్రస్ గల్లంతు అవుతుందని పేర్కొన్నారు. 2001 నుండి తెరాసకు కంచుకోటగా ఉందని, రాబోయే ఉప ఎన్నికల్లో సైతం గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.