మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని ఏజెన్సీలకు కేంద్రం అధికంగా నిధులు కేటాయిస్తుంది. గత ఆరేళ్ల నుంచి వేల కోట్ల రూపాయలు వీటికి అందాయి. 2015 నుంచి ఈ నిధుల కేటాయింపులు 350 శాతం పెరగడం గమనార్హం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ ది కాగ్ ను ప్రవేశపెట్టారు. కేంద్రం నుంచి నేరుగా నిధులు బదిలీ అయ్యాయని కాగ్ గుర్తించింది. కాగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. రాష్ట్రం పొందిన నిధులు,వ్యయం, ఇతర ఆర్థిక అంశాలపై ఇందులో పూర్తి పిక్చర్ లేదు. 2015 -16 లో గుజరాత్ కు రూ.2,542కోట్ల నిధులు అందాయి.2019-20 నాటికి అది 350 శాతం పెరిగి రూ.11,659 కోట్లకు చేరడం గమనార్హం.2019-20 లో ప్రైవేట్ సెక్టార్ కంపెనీలకు కేంద్రం నుంచి నేరుగా రూ.837 కోట్లు అందాయి.
ఇదే సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు రూ. 17 కోట్లు, ట్రస్టు లకు 79 కోట్ల మేర చేరాయి. రిజిస్టర్ సొసైటీలు, ఎన్జీవోలకు కేంద్రం నుంచి 18.35 కోట్లు. కొందరు వ్యక్తులకు 1.56 కోట్లు నేరుగా కేంద్రం నుంచే అందాయి. అయితే ఈ నిధుల బదిలీలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా జరగకపోవడం గమనించాల్సిన అంశం.ఇక కేంద్ర,కేంద్ర- రాష్ట్ర పథకాల అమలు కోసం 2019-20 లో కేంద్రం నుంచి గుజరాత్ కు భారీగానే నిధులు సమకూరాయి . ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, గాంధీనగర్,అహ్మదాబాద్ కోసం ది మెట్రో- లింగ్ ఎక్స్ప్రెస్, ఉపాధి హామీ పథకం, ఎంపీలాడ్స్, ప్రధానమంత్రి మాతృ వందన యోజన వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. గుజరాత్ లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ పిఎస్యు లు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ, అటానమస్ రిజిస్టర్డ్ సొసైటీలు కేంద్రం నుంచి నేరుగా భారీ మొత్తంలో నిధులు పొందిన ఏజెన్సీలలో ఉన్నాయి. అని ఓ వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది.
అయితే గుజరాత్ సంస్థలకు నిధుల కేటాయింపు విషయంలో తప్పు లేనప్పటికీ.. ఫెడరల్ స్ఫూర్తి భావనను మోడీ ప్రభుత్వం విస్మరిస్తున్న ట్టుగా కనిపిస్తోందని విశ్లేషకులు తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల కేటాయింపుల అసమానతలు అధికమయ్యాయి అని ఆరోపించారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేటాయించాలని సూచించారు.