ఆ లక్ష్యంతోనే యూపీ క్యాబినెట్‌ విస్తరణ!?

N.Hari
ఉత్తర్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ.. ఆ రాష్ట్రంలో మంత్రివర్గాన్ని విస్తరించింది. ఓటర్లపై ప్రభావం చూపే కీలక నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించింది. దళిత నినాదమే లక్ష్యంగా ఎన్నికలకు వెళ్లేందుకు క్యాబినెట్‌ కూర్పే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. శాసనసభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించింది. శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్ప్రదేశ్ మంత్రివర్గంలో భారతీయ జనతా పార్టీ కీలక మార్పులు చేసింది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇస్తూ.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరించింది. కొత్తగా ఆరుగురిని క్యాబినెట్‌లోకి తీసుకుంది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన సీనియర్ నేత జితిన్ ప్రసాద క్యాబినెట్‌లో మంచోటు దక్కించుకున్నారు. బ్రాహ్మణ వర్గం ఓటర్లపై ఈయనకు మంచి పట్టు ఉంది. ఇది తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ప్రసాదతో సహా ఛత్రపాల్ సింగ్ గంగ్వార్, సంగీత బల్వంత్, పల్తూ రామ్, దినేశ్ ఖాటిక్, సంజీవ్ కుమార్, ధరమ్వీర్ సింగ్లను క్యాబినెట్‌లోకి యోగి ప్రభుత్వం తీసుకుంది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
2022లో యూపీ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో.. 2017 ఎన్నికల్లో భాజపా-309, ఎస్‌పీ-49, బీఎస్‌పీ-18, కాంగ్రెస్-7 చొప్పున స్థానాలను సాధించాయి. అయితే వచ్చే సంవత్సరంలో జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో పోటీపై అధికార బీజేపీ కీలక ప్రకటన చేసింది. నిషద్‌ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి.
వచ్చే సంవత్సరంలో జరగనున్న యూపీ శాసనసభ ఎన్నికల కోసం పార్టీలు అన్నీ తమతమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈసారి యూపీలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దృఢ సంకల్పంతో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. అయితే ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చిన కాంగ్రెస్... ఆ రాష్ట్ర ఎన్నికల ముందు 'దళిత' అస్త్రాన్ని వదిలింది. ఎన్నికల్లో ఇది ప్రయోజనం చేకూరుస్తుందన్న ధీమాతో ఉంది. పంజాబ్లో దళిత వ్యూహం.. యూపీలోనూ ఉపయోగపడుతుందని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. మరి కాంగ్రెస్ వ్యూహం ఉత్తర్ప్రదేశ్లో ఫలిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: