కేసీఆర్‌ టెంపుల్‌ ఫర్‌ సేల్‌!

N.Hari
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గుడి అమ్మకానికి వచ్చింది. గుడి ఏమిటి? అమ్మకానికి రావడం ఏమిటి? అనడం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తెలంగాణ ఉద్యమ సారథి, రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ అని భావించిన ఓ అభిమాని ఆయనకు ఏకంగా గుడి కట్టాడు. అయితే ఇప్పుడు అదే అభిమాని.. తీవ్ర అసంతృప్తితో కేసీఆర్‌ మందిరాన్ని అమ్మకానికి పెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్‌ తన ఇంటి ఆవరణలోనే కేసీఆర్‌కు గుడి నిర్మించి వీరాభిమానిగా నిలిచాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గుండ రవీందర్‌.. అప్పుడు అనేక ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను, అలాగే పార్టీ కార్యక్రమాలను కూడా తన సొంత ఖర్చుతో నిర్వహించారు. ఇందుకోసం తన ఆస్తులను సైతం అమ్ముకున్నాడు. అలా ఆయన చేసిన కృషికి కాను దండేపల్లి వాసులు తెలంగాణ రవీందర్‌ అని పేరు తెచ్చుకున్నాడు.
గుండ రవీందర్.. కేసీఆర్‌ గుడికి కట్టడానికి ముందే తెలంగాణ తల్లి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశాడు. వీటికి కూడా తన సొంత ఖర్చును వెచ్చించాడు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వచ్చాక.. గుండ రవీందర్‌ దశ తిరుగుతుందని అంతా భావించారు. అయితే పార్టీలో ఆయనకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఏళ్లు గడుస్తున్నా.. ఆయనకు ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో చుట్టు పక్కల వారు ఎత్తిపొడుస్తూ వచ్చారు. అయినప్పటికీ కేసీఆర్‌పై అభిమానంతో ఆ బాధను అలాగే దిగమింగుకుని పార్టీలో కొనసాగారు. ఈ క్రమంలోనే 2016లో తన ఇంటి ఆవరణలో టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మందిరంను నిర్మించాడు. అప్పటి నుంచి రవీందర్‌ కుటుంబ సభ్యులు ప్రతిరోజూ కేసీఆర్‌ విగ్రహానికి పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమం అయిపోయాక మిగతా పనులు చేసుకునేలా గుండ రవీందర్‌ సభ్యులు మెలుగుతారని గ్రామస్థులు చెబుతుంటారు.
అయితే కేసీఆర్‌ను అంతగా అభిమానించి.. ఆయనకు గుడి కూడా కట్టి దైవంగా కొలుస్తున్న వీరాభిమాని గుండ రవీందర్‌ను టీఆర్‌ఎస్‌ నేతలు పార్టీకి మరింత దూరం పెట్టారు. ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో తన ఆవేదనను కేసీఆర్ కు చెప్పుకునేందుకు రవీందర్ గతేడాది ప్రగతి భవన్‌కు వెళ్లారు. సెక్యూరిటీ అనుమతించకపోవడంతో ఆవేదనతో అక్కడే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయినా కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో కొద్ది రోజుల క్రితం రవీందర్.. టీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. చివరికి తాను ఎంతో అభిమానంతో కట్టుకున్న కేసీఆర్ గుడిని కూడా కొన్నాళ్ల క్రితం మూసేశాడు. చివరికి ఆ గుడిని అమ్మకానికి పెట్టాడు. గుడిని అమ్మతున్నట్టు ఫేస్ బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఆస్తులు పోగొట్టుకుని, త్యాగాలు చేసిన వారికి ఎలాంటి గుర్తింపు లేదన్న ఆవేదనతోనే కేసీఆర్‌ గుడిని అమ్మకానికి పెట్టినట్లు గుండ రవీందర్‌ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: