ఢిల్లీ నుంచి రిమోట్ తో పాలన..! ఎంతవరకు సమంజసం ?
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా వెనుక బీజేపీ అధిష్టానం ఆదేశాలు ఉన్నట్టు స్పష్టం గా కనిపిస్తోంది. కొత్త నాయకత్వంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిలో భగంగా పటేల్ సామాజిక వర్గానికి చెందిన నేతకు తదుపరి సీఎం బాధ్యతలు అప్పగించనున్నట్టు ప్రచారం జరుగుతుండగా.. కొత్త సీఎం ఎవరనే దానిపై చర్చ మొదలైంది.
గుజరాత్ సీఎంగా తనకు పనిచేసే అవకాశం ఇచ్చిన బీజేపీకి విజయ్ రూపానీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా గుజరాత్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినట్టు చెప్పిన ఆయన.. మోడీ నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామన్నారు. సీఎంగా ఎవర్ని ఎంపిక చేసినా.. ప్రధాని మోడీ నాయకత్వంలో పనిచేస్తామన్నారు. తమలో ఎలాంటి విభేదాలు లేవనీ.. అందరం కలిసి ఉన్నామన్న రూపానీ.. కార్యకర్తగా పార్టీకి సేవ చేస్తానని చెప్పారు.
ముఖ్యమంత్రి రేసులో డిప్యూటీ సీఎం నితిన్ పటేల్.. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పటేల్, ఆర్సీ ఫాల్దూ ఉన్నారు. గుజరాత్ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచే రిమోట్ ద్వారా బీజేపీ నడిపిస్తోందని కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ అన్నారు. ప్రభుత్వాన్ని నడపడంలో బీజేపీ విఫలమైందనే విషయం సీఎం రాజీనామాతో స్పష్టమైందన్నారు. కోవిడ్ లో శ్మశాన వాటికల భయానక చిత్రాలు రాష్ట్ర ప్రతిష్టతను దిగజార్చాయన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇప్పుడీ డ్రామా ఆడుతున్నారు అని అన్నారు.