తెలంగాణలో 'షర్మిల' రాజ్యం: విజయమ్మ కల ఫలించేనా..?

Chakravarthi Kalyan
వైఎస్ విజయమ్మ.. తెలుగు రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఆమె నేరుగా ఎప్పుడూ రాజకీయాలు చేయకపోయినా... దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భార్యగా సుపరిచితురాలు.. ఓ మాజీ సీఎం భార్య... ఓ ప్రస్తుత సీఎం తల్లి.. ఓ సీఎం అయితీరుతానంటున్న మహిళకూ తల్లి విజయమ్మ. సహజంగా ఓ గృహిణి అయిన విజయమ్మ రాజకీయ వ్యూహాలు ఎప్పుడూ అమలు చేయలేదు.. రాజకీయాల్లో వేలు పెట్టలేదు. భర్త సీఎంగా ఉన్నరోజుల్లోనూ ఆమె పెద్దగా రాజకీయాలు పట్టించుకోలేదు.


తండ్రి మరణం తర్వాత మాత్రం ఆమె కొడుకు కోసం కొన్నాళ్లు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. తన కొడుకును ఆశీర్వదించమని ఆమె ప్రజలను కోరారు. కొడుకు జగన్ పెట్టిన పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. కాస్త ఆలస్యంగానైనా ఆమె కోరిక నెరవేరింది. జగన్ ఏపీ సీఎం అయ్యాడు. కానీ.. ఇప్పుడు ఆమె మరో సంతానం షర్మిల కూడా తెలంగాణ సీఎం కావాలని సంకల్పం తీసుకుంది. ఇప్పుడు ఆమె తన రెండో సంతానం కోరిక తీర్చేందుకు తనవంతు సహకారం అందిస్తున్నారు.


ఈనెలలోనే వైఎస్ వర్థంతి ఉన్న దృష్ట్యా.. ఈ సందర్భంగా వైఎస్‌తో అనుబంధం ఉన్న ఏపీ, తెలంగాణ నేతలందరికీ ఫోన్‌ చేసి.. ఆత్మీయ సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. అయితే.. ఈ సమావేశం షర్మిల కోసమే అన్న చర్చ మొదలైంది. ఏటా వైఎస్ వర్థంతి రోజు.. ఇడుపులపాయలో ప్రార్థనలు మాత్రమే జరగేవి.. కానీ ఈసారి హైదరాబాద్‌లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు.. షర్మిల పార్టీలోకి కీలక నేతలను ఆహ్వానించడం కోసమేనని భావిస్తున్నారు.


అయితే విజయమ్మ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయన్నది మాత్రం అనుమానమే. ఎందుకంటే.. షర్మిల పార్టీ పెట్టినా ఇప్పటి వరకూ పెద్దగా ఊపు కనిపించడం లేదు. అందులోనూ ఇప్పటికే తెలంగాణలో టీఆర్‌ఎస్ బలంగా ఉంది.. కాంగ్రెస్, బీజేపీలు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు షర్మిలకు అవకాశం ఉంటుందా.. విజయమ్మ కలలు కన్న షర్మిల రాజ్యం తెలంగాణలో సాధ్యమా అన్నది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: