ఆ ఒక్కటే అశోక్ గజపతిని చెడగొట్టిందా...?
అశోక్ గజపతి రాజు.. తెలుగు దేశంలో సీనియర్ నేత. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి.. ఎన్టీఆర్ వంటి నాయకుడు కూడా పూసపాటి కుటుంబీకులను గౌరవించే వారు. అంతే కాదు.. రాజకీయాల్లో ఉన్నా.. అందులోని దుర్లక్షణాలను పెద్దగా అంటనీయని వ్యక్తి అశోక్ గజపతి రాజు. రాష్ట్రంలో మంత్రి స్థాయి నుంచి కేంద్ర కేబినెట్ మంత్రి వరకూ అనేక కీలక పదవులు నిర్వహించారు. అశోక్ గజపతి అవినీతికి ఆమడ దూరం అని చెబుతారు. అలాంటి అశోక్ గజపతికి ఇటీవల వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
ఇటీవలి కాలంలో మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పదవి కారణంగా పూసపాటి కుటుంబం తరచూ వార్తల్లోకి వచ్చింది. ఈ ట్రస్టుకు సుదీర్ఘ కాలంగా ఛైర్మన్‌గా ఉంటున్న అశోక్‌ను తప్పించి జగన్ సర్కారు ఆయన అన్న కూతురు సంచయితను ఆ సీట్లో కూర్చో బెట్టింది. అప్పటి నుంచి వైసీపీ అశోక్ గజపతిని టార్గెట్ చేస్తూనే ఉంది. ఇక వైసీపీ నేత విజయసాయిరెడ్డి అయితే.. ఇటీవలి కాలంలో అశోక్ గజపతి అంటే ఒంటికాలిపై లేస్తున్నారు. ఆయన్ను జైలుకు పంపి తీరుతామంటున్నారు.
అయితే..అలాంటి విజయసాయి కూడా అశోక్ అవినీతిపరుడు అని చెప్పడం లేదు. కానీ.. అశోక్ బలహీనతల్లా పదవీ వ్యామోహం అని చెబుతున్నారు. మంత్రి పదవో, ప్రభుత్వ హోదానో లేకపోతే అశోక్ బతకలేడని.. అందుకే పాడి ఆవు లాంటి మాన్సాస్ ట్రస్టును బాబుకు అప్పజెప్పాడని విమర్శిస్తున్నారు. వందల కోట్ల భూములకు NOCల జారీ చేయడం ద్వారా అశోక్ భారీ స్కామ్ కు కారణమయ్యారని.. 313 ఎకరాలు అడగకుండానే కట్టబెట్టారని చెబుతున్నారు. మరి పదవీ వ్యామోహమే అశోక్‌ను చెడగొట్టిందా.. ఏమో..!