కౌన్ బనేగా ఏపీ కేబినేట్ సీట్..!
తమకు ఎలాగైనా మంత్రి పదవి దక్కాలని ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు కొందరు నేతలు. సీఎం చూపు తమ వైపు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక స్టీల్ సిటీ విశాఖ త్వరలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది. ఇక అక్కడి నుంచే పాలన మొదలవుతున్న కారణంగా.. మంత్రి వర్గ విస్తరణపైనే అందరి దృష్టి నెలకొంది. విశాఖ నుంచి మంత్రి ఎవరు అవుతారనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఆ ప్రాంతం నుంచి మంత్రిగా అవంతి శ్రీనివాసరావు ఉండగా.. ఆయన స్థానంలో గుడివాడ అమర్ నాథ్ ను నియమిస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం విశాఖలో 15మంది ఎమ్మేల్యేలున్నారు.
గుడివాడ అమర్ నాథ్ కు అక్కడ బలమైన కేడర్ ఉంది. అంతేకాదు అటు జగన్ తోనూ.. ఇటు విజయసాయిరెడ్డితోనూ గుడివాడ అమర్ నాథ్ చాలా సన్నిహితంగా మెలుగుతుంటారు.
ఇక అంబటి రాంబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేందు. ఎందుకంటే ఆయన పార్టీలో అందరికంటే సీనియర్. అటు వైఎస్ ఆర్ కు వీర విథేయుడిగా మెలిగిన ఆయన.. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ కు అండగా ఉన్నారు. ఆయన కష్టనష్టాల్లో పాలుపంచుకున్నారు. అధికార ప్రతినిధిగా అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఖాయమని అందరూ అనుకున్నారు.. కానీ అది జరుగలేదు. ఇప్పుడు మళ్లీ ఆ ఊహాగానాలు జోరందుకున్నాయి. అంబటికి ఈ సారి మంత్రి పదవి దక్కుతుందని అనుకుంటున్నారు. ఇక రోజా కూడా మంత్రి పదవిపై చాలా ఆశలే పెట్టుకున్నారు. చూద్దాం..