ప్రవీణ్‌ కుమార్‌పై కోపంతో కేసీఆర్ సర్కారు ఏం చేసిందంటే..?

Chakravarthi Kalyan
ఆర్ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ బీఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన బీఎస్పీలో చేరిక సందర్భంగా నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. బీఎస్పీ ప్రభావం పెద్దగా లేకపోయినా.. ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్‌ ధన బలం, అంగ బలం ఉన్న నాయకుడు కాకపోయినా.. ఆయన రాజకీయ అరంగేట్రం మాత్రం అద్భుతంగా సాగిందనే చెప్పాలి.. వేల మందితో ర్యాలీ నిర్వహించి.. నల్గొండ మొత్తం నీలిమయం అయ్యేలా సభ అద్భుతంగా సాగింది.

అయితే.. ఆరెస్పీ సభ బాగా జరగడం... మొదటి సభలోనే ఆయన కేసీఆర్ సర్కారును విమర్శించారు. దొరల పాలన పోవాలని.. బహుజన రాజ్యం రావాలని అన్నారు. అంతే కాదు.. ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు వచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. అయితే ఈ మాటలపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఏకంగా ఐదారుగురు నేతలు ఆరెస్పీపై విమర్శల వర్షం గుప్పించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కూడా ఆరెస్పీపై విమర్శలు చేసారు. ఈ విమర్శలకు నొచ్చుకున్న ఓ ఆరెస్పీ అభిమాని గాదరి కిషోర్‌కు ఫోన్‌ చేసి బెదిరించడం.. అది కాస్తా వైరల్ అవ్వడం చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో అంశం టీఆర్ఎస్‌ ఆరెస్పీ మధ్య మంటలు రేపుతోంది. అది నార్కట్ పల్లి తహసీల్దార్ రాధ బదిలీ అంశం. నార్కట్ పల్లి తహసీల్దార్ రాధను ఇవాళ తెలంగాణ సర్కారు ఓ మారుమూల మండలానికి బదిలీ చేసింది. దీనిపై ఆరెస్పీ ఘాటుగా స్పందించారు. ఆయన ఎందుకు స్పందించారంటే.. నార్కట్ పల్లి తహసీల్దార్ రాధ భర్త ప్రవీణ్‌ కుమార్ అనుచరుడు.. బీఎస్పీ నేత. నల్గొండ సభ విజయవంతం అయినందుకే ఇప్పుడు కేసీఆర్ సర్కారు బీఎస్పీ నేతలపై కక్ష సాధిస్తోందని ఆరెస్పీ విమర్శించారు.

" ఆమె భర్త మా పార్టీ నేత అనే కదా...  ప్రతిపక్షంలో ఉండడం నేరమా...? బహుజన బిడ్డలపై కేసీఆర్ ప్రభుత్వానికి  ఎందుకింత పగ...? అని ఆరెస్పీ ట్విట్టర్ లో ప్రశ్నించారు. నల్గొండ సభ కేవలం ఆరంభం మాత్రమేనని... దానికే ఇంత ఉలిక్కి పడుతున్నారన్నారని ఆరెస్పీ అన్నారు.  బదిలీ చేసిన ఆర్డర్ కాపీని కూడా ఆరెస్పీ ట్విట్టర్ కు జాత చేశారు. మరి ఈ వివాదంపై టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rsp

సంబంధిత వార్తలు: