రేవంత్ మామూలోడు కాదుగా..!

M N Amaleswara rao
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక రేవంత్ రెడ్డి వ్యూహాలు మరింత పదును అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గానే ఉండటంతోనే తన అనుకున్నట్లు పనులు ఏమి జరగలేదు. పైగా కాంగ్రెస్‌లో సీనియర్ నేతల రాజకీయం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే అప్పుడు రేవంత్ ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ పీసీసీ అయ్యాక తన సొంత వ్యూహాలతో అటు అధికార టీఆర్ఎస్‌ని టార్గెట్ చేస్తూనే, ఇటు తమ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నారు.

అలాగే సొంత పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలని బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకుంటున్నారు. దారిలోకి రానివారిని మాణికం ఠాగూర్ ద్వారా దారిలో పెడుతున్నారు. ఇదే క్రమంలో రేవంత్ తెలివిగా ఓ ఇద్దరు నేతలని లైన్‌ చేసేశారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆగష్టు 9న లక్షమంది దళిత, గిరిజనులతో కలిసి దండోరా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో నిర్వహించే ఈ సభ బాధ్యతలు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్‌రావుకు అప్పగించారు. దీంతో అదే జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అలకపాన్పు ఎక్కారు. తనకు తెలియకుండా ఎలా అప్పగిస్తారు అంటూ, రేవంత్‌నే నిలదీశారు. రేవంత్ కూడా...నువ్వు నీ నియోజకవర్గానికే పరిమితం కావాలని మహేశ్వర్ రెడ్డినీ హెచ్చరించారు.
 దీంతో మహేశ్వర్ రెడ్డి మరింత అసంతృప్తికి గురయ్యారని తెలిసింది. ఈ క్రమంలోనే రేవంత్, కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, షబ్బీర్ అలీలనీ రంగంలోకి దించి, మహేశ్వర్ రెడ్డినీ సెట్ చేయించారు. అలాగే దండోరా బాధ్యతలు అటు ప్రేమ్ సాగర్‌కు, ఇటు మహేశ్వర్ రెడ్డికి కాకుండా ఆదిలాబాద్ జిల్లా నాయకత్వానికి అప్పగించారు. అలాగే సభని సక్సెస్ చేయడం కోసం ప్రేమ్ సాగర్, మహేశ్వర్ రెడ్డిలు పని చేయాలని సూచించారు. దీంతో ఇద్దరు నాయకులు అంగీకరించి, దండోరా సభాని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరు నాయకులని రేవంత్ తెలివిగా సెట్ చేసేశారు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: