వంశీకి ఓకే..మరి ఆ ముగ్గురు పరిస్తితి ఏంటి?
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి జంప్ చేశారు. అంటే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు వైసీపీకి అనుకూలంగా తీర్పు ఇస్తే, ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా వారు ముందుకెళ్లారు. అందుకే 2019 ఎన్నికల్లో ఆ జంపింగ్ ఎమ్మెల్యేలు ప్రజాగ్రహానికి గురయ్యారు. జంపింగ్ ఎమ్మెల్యేలు చిత్తుగా ఓడిపోయారు. ఏదో గొట్టిపాటి రవికుమార్ ఒక్కరే మళ్ళీ గెలవగలిగారు.
ఇక ఇప్పుడు వైసీపీ టర్మ్ వచ్చింది. వైసీపీ అధికారంలోకి రావడంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, జగన్‌కు జై కొట్టారు. కాకపోతే గతం కంటే కాస్త భిన్నంగా డైరక్ట్‌గా వైసీపీ కండువా కప్పుకోకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా, వైసీపీకి మద్ధతు ఇచ్చారు. అయితే ఏది ఎలా జరిగితే ఏముంది...వారు కూడా వైసీపీ ఎమ్మెల్యేలుగానే నడుచుకుంటున్నారు. మరి ఇలా జంప్ చేసిన ఎమ్మెల్యేలని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తారా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది.
పార్టీలు మారినా సరే ప్రజలకు సేవ చేస్తే ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా సొంత పనులనే చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తే, ప్రజలు మాత్రం వారిని చిత్తుగా ఓడించడం ఖాయం. ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో వైసీపీ వైపుకు వెళ్ళిన నలుగురు ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీ పరిస్తితి కాస్త మెరుగుగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ఇప్పుడే క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లోపు వారు ప్రజలకు ఎక్కువగా అండగా ఉంటే ఇబ్బంది ఉండదు. లేదంటే ఆ జంపింగ్ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లోకి వెళ్ళినట్లే.