టిఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి, బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు కాషాయ పార్టీ పూర్తిగా వంట పట్టినట్లు లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఆ పార్టీ కండువా వేసుకున్నాడు తప్ప, ఏనాడు ఆయన నోట జైశ్రీరామ్ నినాదం కానీ, మోడీని తలచుకోవడం కానీ ఇప్పటివరకు చేయలేదు. దీంతో ఆ పార్టీ నాయకులకు ఈటల పై కాస్త అనుమానాలు కలుగుతున్నాయి. జైశ్రీరామ్ అనే నినాదం లేకుండా ఏ బిజెపి నేత ప్రసంగాన్ని మనం చూడలేం. అందులో చేరినటువంటి కొత్త లీడర్ ఎవరైనా మొదట్లో కొంత ఇబ్బంది పడిన తర్వాత ఆ స్లోగన్ లకు అలవాటు పడతారు. కానీ ఈటల మాత్రం ఇప్పటివరకు ఏ ఒక్క స్టేజీపైన కానీ, సభలో కానీ జైశ్రీరామ్ నినాదం చేయలేదని, బిజెపి పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆయన బిజెపిలో చేరినప్పటి నుండి హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎలాగైనా పట్టు సాధించాలని గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై దీటైన విమర్శలు చేస్తూ హుజురాబాద్ కాషాయ నాయకులలో ఉత్సాహాన్ని నింపుతూ వస్తున్నారు. ఎక్కడ కూడా తగ్గకుండా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఈ ప్రచార సభల్లో ప్రభుత్వాన్ని మాత్రమే నిందిస్తూ ఉన్నాడని, ఇక్కడ కూడా బిజెపికి అనుగుణంగా తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోలేదని వారంటున్నారు.
కమ్యూనిస్టు భావాలు గల ఈటలకు బిజెపి నినాదాలు వంట పట్టట్లేదని పలువురు బిజెపి నాయకులు అంటున్నారు. ఏ ఒక్క దగ్గర కానీ మోడీ ప్రభుత్వ పథకాల గురించి, ఆయన పాలన గురించి ప్రస్తావించడం లేదు. ఏ సభలో మాట్లాడిన ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆయనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడం తప్ప, బిజెపిని ముందుకు తీసుకువచ్చి పార్టీ గురించి చెప్పడంలో ఈటల వెనకడుగు వేస్తున్నారు. ఆయన ఎప్పుడైనా తన గురించి తాను, తనకు జరిగిన అన్యాయం ఈ రెండు విషయాల గురించి తప్ప వేరే విషయాన్ని ముందుకు రానివ్వకుండా, తమ క్రేజ్ ను ఎక్కడా తగ్గించుకోకుండా ఈటల మెదులుతున్నాడని చెప్పవచ్చు .