అప్పుల అప్పారావులు.. మన కేంద్ర మంత్రులు..
అప్పుల అప్పారావు నారాయణ్ రాణే..
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కి అత్యథికంగా అప్పులున్నట్టు తేలింది. ఆయన అప్పుల విలువ ఏకంగా రూ. 30.5కోట్లు. 11.5 కోట్ల రూపాయల అప్పుతో పీయూష్ గోయల్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. 16మంది మంత్రులు కోటి రూపాయలకన్నా ఎక్కువ అప్పులు చేశారు. వీరిలో ముగ్గురు రూ.10కోట్లకంటే ఎక్కువ రుణాలు తీసుకుని రుణగ్రస్తులయ్యారు.
ఆస్తుల విషయానికొస్తే..
ఇక సగటున మోదీ టీమ్ లో.. 90శాతం మంది కోటీశ్వరులున్నట్టు తేలింది. దాదాపు 70 మంది మంత్రులు కోటీశ్వరులు. మంత్రుల ఆస్తుల సరాసరి విలువ రూ.16.24కోట్లు. మోదీ టీమ్ అందరికంలో జ్యోతిరాదిత్య సింధియా ధనవంతులు. జ్యోతిరాదిత్య సింధియా ఆస్తుల విలువ 379కోట్ల రూపాయలు కావడం విశేషం. అప్పుల్లో రెండో స్థానంలో ఉన్న మంత్రి పీయూష్ గోయల్ ఆస్తుల్లో కూడా రెండో స్థానం నిలబెట్టుకున్నారు. ఆయన ఆస్తుల విలువ 95కోట్ల రూపాయలు. విశేషం ఏంటంటే.. అప్పుల్లో మొదటి స్థానంలో ఉన్న నారాయణ్ రాణే, ఆస్తుల విషయంలో మూడో స్థానంలో ఉండటం. ఆయనకు 87.77కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఆస్తి ఉన్నా కూడా అప్పులు చెల్లేయడంలో మాత్రం ఎందుకో మంత్రులు వెనకడుగేస్తుండటం మరో విశేషం.
అఫిడవిట్ లెక్కలు వేరు, అసలు లెక్కలు వేరు. రాజకీయ నాయకులు అఫిడవిట్లలో చూపించే ఆస్తులు, అప్పులను పూర్తిగా నమ్మేంత అమాయకులు ఎవరూ లేరు. ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల మేర బదలాయించి, అప్పులు మాత్రం తమ పేర్లమీద ఉంచుకునే నేతలు చాలామందే ఉన్నారు. అందర్నీ ఒకేగాటన కట్టలేం కానీ, చాలామంది ఇదేబాపతు అని చెప్పుకోవాల్సిందే.