ఎందుకు ఈ వైరస్‌లన్నీ కేరళతోనే మొదలవుతాయి..?

Chakravarthi Kalyan
కరోనా మహమ్మారి కాస్త శాంతిస్తుందనుకుంటే  ఇంకో మహమ్మారి వార్తలు భయపెడుతున్నాయి. కేరళలో జికా వైరస్ కేసులు వెలుగు చూశాయన్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకూ కేరళలో 14 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ జికా వైరస్ కరోనా వైరస్‌ తరహాలో మనుషుల తుంపర్ల నుంచి కాకుండా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే.. గతంలో కరోనా వైరస్ కూడా ముందుగా మన దేశంలో కేరళలోనే వెలుగు చూసింది. అంతే కాదు.. అంతకు ముందు కరోనా తరహాలోనే నిఫా వైరస్ కూడా కేరళను వణికించింది కూడా.

మరి ఎందుకు ఈ వైరస్‌లు అన్నీ ముందుగా కేరళతోనే మొదలవుతున్నాయన్న ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు ఆ రాష్ట్రం నేపథ్యంలో ఓసారి పరిశీలించాలి. కేరళ దేశంలోనే ‌చైతన్యవంతమైన రాష్ట్రం. దేశంలోనే అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా కేరళయే. అలాగే ప్రపంచంలో ఎక్కువగా వలస వెళ్లే వారిలో కేరళ వాళ్లు ముందు వరసలో ఉంటారు. ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా అక్కడ కేరళ వాళ్లు ఉంటారని అంటుంటారు.

ఈ చైతన్యవంతమైన ప్రవృత్తే కేరళకు ఈ వైరస్‌లను తెచ్చి పెడుతోందన్న వాదన కూడా ఉంది. ఈ వైరస్‌లు అన్నీ మన దేశంలో పుట్టినవి కాదు.. విదేశాల నుంచి వచ్చినవే. అలా విదేశాల నుంచి వైరస్‌లు రావడానికి కేరళ ఎన్నారైలు కారణం అవుతున్నారు. విదేశాల నుంచి సొంత ప్రాంతానికి వచ్చేటప్పుడు కొందరు తమకు తెలియకుండానే వైరస్‌లను మోసుకొస్తున్నారు. మరింకొందరు విదేశాల్లో వైరస్‌ బారిన పడిన తర్వాత అక్కడ చికిత్స పొందలేక సొంత రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు.

ఇలా కారణాలు ఏమైనా కరోనా.. నిఫా, జికా.. అన్ని వైరస్‌లు మొదట కేరళలోనే గుర్తించబడ్డాయని చెప్పొచ్చు. అయితే.. దేశంలోకి ఇలాంటి ప్రమాదకర వైరస్‌లను తెచ్చిందన్న పేరు ఉన్నా.. ఇలాంటి వైరస్‌లను కట్టడి చేయడంలోనూ కేరళకు మంచి పేరే ఉంది. కరోనా, నిఫా వైరస్‌ల కట్టడి విషయంలో కేరళ బాగా పని చేసిందన్న పేరుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: