కేరళను వణికిస్తున్న జికా వైరస్.. మీకు రాకుండా ఉండాలంటే..?
ఈ జికా వైరస్‌ని కట్టడి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి అంటున్నారు. కేరళలతో పాటు పక్క రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. ఇక ఈ జికా వైరస్ వివరాల్లోకి వెళ్తే.. ఈ వ్యాధికి ఎడిస్ ఈజిప్టి, ఎడిస్ ఆల్బోపిక్టస్ రకం దోమలు వాహకాలుగా ఉంటాయి.
ఈ వైరస్ కలిగిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం ద్వారాఈ జికా వ్యాధి సంక్రమిస్తుంది. అంతే కాకుండా లైంగికంగా కూడా ఈ వైరస్ సంక్రమించే అవకాశం ఉందట. గర్భిణులకు ఈ వ్యాధి వస్తే పుట్టబోయే పిల్లలకూ వ్యాపించే ఛాన్స్ ఉంది. పుట్టే పిల్లలు తల చిన్నగా ఉండి పుడతారు.
ఈ జికా వైరస్ రాకుండా ఉండాలంటే.. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పొడుగు షర్ట్, ప్యాంట్‌ను ధరించాలి. రెండు నెలల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు దోమల తెరను వాడాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ జికా వైరస్ వస్తే.. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండ్లకలక, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు, లింఫ్ గ్రంథులు ఉబ్బడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ జికా వైరస్ వ్యాధిని ఆర్టీ పీసీఆర్ ద్వారా నిర్ధారిస్తారు. జికా వ్యాధికి ప్రత్యేకమైన చికిత్సంటూ ఏమీ లేదు. రోగి లక్షణాలను బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. రోగులకు బాగా విశ్రాంతి అవసరం. రోగులు నీరు బాగా తాగాలి.