భారత రాజకీయ చరిత్రలో ఆ రికార్డు సీతక్కకే సొంతం...!
ఎక్కడో మారుమూల గిరిజన గ్రామంలో పుట్టిన సీతక్క నక్సలైట్ ఉద్యమంలో పని చేసి... రాజకీయాల్లోకి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అది కూడా ఓ మహిళ అయ్యి ఉండటం మరో విశేషం. భారత దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి గొప్ప రికార్డు ఏ రాజకీయ నేతకు కూడా లేదు. 2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఐదేళ్ల పాటు ఆమె నియోజకవర్గంలోనే ఉన్నారు. పూర్తిగా వెనక పడడంతో పాటు కొండలు , కోనల్లో ఉండే గిరిజన నియోజకవర్గం అయిన ములుగు ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆమె వెన్నంటే ఉన్నారు.
ఈ క్రమంలోనే 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టింది. నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన ఆమె అసెంబ్లీ మెట్లు ఎక్కడం అప్పట్లో తెలుగు రాజకీయాల్లో తలపండిన యోధాను యోధులను సైతం ఆలోచింప చేసింది. ఆమె ప్రజల మనస్సులు గెలిచిన తీరు అద్భుతం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిన ఆమె.... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ పై గెలిచి రెండవసారి అసెంబ్లీ కి ఎన్నికైంది. రేపటి రోజు ఆమె మంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే చెప్పాలి.