ఆ విషయంలో లోకేష్-పవన్‌ల మధ్య పోటీ ఉంటుందా?

M N Amaleswara rao
ఏపీలో నిరుద్యోగుల పోరాటం తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి రాగానే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ పేరిట ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్ల నుంచి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. కానీ తాజాగా జగన్ జాబ్ క్యాలెండర్ వదిలారు. ఇక జాబ్ క్యాలెండర్ వదిలారని సంతోష పడే లోపే, అందులో ఇచ్చిన ఉద్యోగాలని చూసి నిరుద్యోగులు పూర్తిగా నిరాశకు గురయ్యారు.
కేవలం అందులో పది వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఎన్నికల ముందు 2 లక్షలపైనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు పది వేల ఉద్యోగాలు ప్రకటించడంపై నిరుద్యోగులు ఆందోళనలు మొదలుపెట్టారు. అయితే రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ ఉద్యోగాలు వచ్చి.. వాలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలు, ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకుని వాటినే చూపిస్తూ ఉద్యోగాలు ఇచ్చేశామని ప్రభుత్వం చెప్పడం చాలా దారుణమని అంటున్నారు.
కీలకమైన పోలీసు, గ్రూప్, డి‌ఎస్‌సి పోస్టులు వదలకుండా ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులపై కేసులు నమోదవుతున్నాయి. దీంతో నిరుద్యోగులకు టీడీపీ నారా లోకేష్ మద్ధతుగా నిలిచారు. ఇటీవలే టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని నారా లోకేష్ పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు అండగా నిలబడుతున్నారు. ఇప్పుడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రద్దు చేసి, 2 లక్షల ఉద్యోగాలతో కొత్త క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఇదే నిరుద్యోగుల సమస్యపై పవన్ కల్యాణ్ సైతం పోరాటం చేసేలా కనిపిస్తున్నారు. చాలారోజుల తర్వాత ఏపీలోకి అడుగుపెట్టిన పవన్‌ని నిరుద్యోగులు కలిసి, తమ పోరాటానికి మద్ధతు ఇవ్వాలని కోరారు. పవన్ సైతం ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తూ, నిరుద్యోగులకు అండగా నిలబడతానని చెప్పారు. ఇలా ఓ వైపు లోకేష్, మరో వైపు పవన్‌లు నిరుద్యోగులకు న్యాయం చేయాలనే విషయంపై పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ పోరాటం వల్ల నిరుద్యోగులకు ఏ మేర లబ్ది చేకూరుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: