దాదాపుగా రెండు ఏళ్ల నుండి ప్రపంచ దేశాలను గజ గజ వణికిస్తూ పరుగులు తీయిస్తున్న ప్రమాదకారి కరోనా వైరస్ ఇప్పుడు కొద్ది రోజులుగా తగ్గు ముఖం పట్టింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రికవరీ రేటు కూడా బాగానే పెరగడంతో జనాలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మాయదారి వైరస్ వ్యాప్తి తగ్గిందే తప్ప ఇంకా ఈ భూమిని విడిచి వెళ్ళ లేదన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని ఓవైపు కరోనా వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. అయినా ఇప్పటివరకు బిక్కుబిక్కుమంటూ ఇళ్లల్లో కూర్చున్న జనం కరోనా కాస్త తగ్గడం, లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేయడంతో స్వేచ్ఛగా బయటికి వచ్చి తిరుగుతున్నారు. చాలా చోట్ల జనాలు గుమిగూడి ఉన్నారు. కొందరైతే కరోనా వెళ్ళిపోయింది అన్నట్టుగా కనీసం మాస్కులు కూడా వేసుకోకుండా అజాగ్రత్తగా ఉంటున్నారు.
దాని ఫలితంగానే నిన్నటి రోజున దేశవ్యాప్తంగా కేసులు మళ్లీ పెరిగాయని నిపుణులు అంటున్నారు. గత కొద్ది రోజులుగా చూస్తే ఉన్న లెక్కలకు భిన్నంగా నిన్న మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఒక సూచికగా తీసుకొని ఇకపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని వీరు చెబుతున్నారు. లేకపోతే చాలా తీవ్రమైన గడ్డు పరిస్థితులను చూడాల్సి వస్తుందని, ఇప్పటివరకు ఒకింత అయితే ఇప్పుడు ప్రమాదం పదిరెట్లు పెరిగే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. దీనికి మనం చేయాల్సిందల్లా జాగ్రత్తగా ఉండడం. పోషకాహారంతో మంచి అలవాట్లతో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవడం, కరోనా నిబంధనలను తప్పకుండా పాటించడం వంటివి చేయాలి.
ఇలా చేస్తేనే ఈ మహమ్మారిని అంతం చేయొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరి ఒక బాధ్యతగల పౌరుడిగా మీ బాధ్యతను తెలుసుకుని మిమ్మల్ని, మీ ఇంటిని, మీ కుటుంబాన్ని మీ సమాజాన్ని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతా మన చేతుల్లోనే ఉంది. మరి మన భవిష్యత్తు ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలని సమయమిది. అవగాహన పెంచుకుని చైతన్యవంతులై మెలుగుతారని ఆశిద్దాం.