మీ డెత్ సర్టిఫికెట్ రెడీ.. వచ్చి తీసుకెళ్లండి?

praveen
ఒక్కో సారి అధికారులు చేసే చేష్టలు ఎలా ఉంటాయో చాలా మందికి ఇప్పటికే అనుభవం అయి ఉంటుంది. తెలసో, తెలియకో, పొరపాటు వల్లో వారు చేసే వింత పనులు నవ్వు తెప్పిస్తాయి. ఎంతలా అంటే బతికున్న వ్యక్తికే మీ డెత్ సర్టిఫికెట్ తీసుకుపోవడానికి రమ్మని ఫోన్ చేశారు థానే అధికారులు. దీంతో కంగుతిన్న సదరు వ్యక్తి మీడియా ముందుకు వచ్చి లబోదిబో మంటూ తన గోడును వెళ్లబోసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.....



చంద్రశేఖర్ దేశాయ్ అనే 54 ఏళ్ల వ్యక్తి థానే మాన్‌పడాలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. చంద్రశేఖర్ కు గతేడాది ఆగష్టులో కరోనా సోకగా.. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుని కరోనాను జయించాడు. కరోనా వచ్చిన సమయంలో థానే మున్సిపాలిటీ అధికారులు తనకు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు కనుక్కుంటుంటే.... బాగా పని చేస్తున్నారని అనుకున్నాడు. కానీ తర్వాత చూస్తే.... ఆయనకు ఈ మధ్య వచ్చిన ఫోన్ కాల్ లో ప్రశ్న విని షాక్ కు గురయ్యాడు. థానే మున్సిపల్ ఆఫీసు నుంచి ఓ మహిళా ఆఫీసర్‌ ఫోన్ చేసి .. చంద్రశేఖర్‌ దేశాయ్‌ పేరు మీద డెత్‌ సర్టిఫికెట్‌ సిద్ధమైందని, వచ్చి తీసుకెళ్లాలని తెలిపింది. దీంతో కంగుతిన్న చంద్రశేఖర్ ఏం చేయాలో తెలియక అలాగే నిష్టూరంగా ఉండిపోయాడు.



తేరుకున్న చంద్రశేఖర్ సదరు ఆఫీసర్ తో తాను బతికే ఉన్నానని చెప్పగా... అందుకు ఆ ఆఫీసర్ మీ ఇంట్లో ఎవరైనా కరోనాతో చనిపోయారా అని ప్రశ్నించిందని చంద్రశేఖర్ మీడియా ముందు వాపోయాడు. ఇలా జరగడంతో షాక్ తిన్న చంద్రశేఖర్ నేరుగా థానే మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లి... అధికారులను నిలదీసి.. జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. అసలు మున్సిపాలిటీ అధికారులు పంపకుండా తన పేరు ఐసీఎంఆర్ కు ఎలా వెళ్లిందని ఆయన ప్రశ్నిస్తున్నాడు. దీనికి తనకు మున్సిపాలిటీ అధికారులు సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: