కేసీఆర్.. ఈటల కోసం సీక్రెట్‌గా ఆ పని చేయిస్తున్నారా..?
మరి హుజూరాబాద్‌లో గెలవాలంటే.. అక్కడి పరిస్థితి కూలంకషంగా అంచనా వేయాలి.. అక్కడి జనం ఏమనుకుంటున్నారు.. వారు కేసీఆర్ పాలన పట్ల ఎలాంటి వైఖరితో ఉన్నారు.. స్థానికంగా ఈటల బలం ఎంత.. స్థానికంగా ఈటలపై జనం ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు.. ఈ విషయాలన్నీ సరిగ్గా తెలిస్తేనే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు రచించాలో తెలుస్తుంది. అందుకే కేసీఆర్ హుజూరాబాద్‌లో ఇంటలిజెన్స్ బలగాలను మోహరించినట్టు వాదనలు వినిపిస్తున్నాయి.
హుజురాబాద్ నియోజకవర్గంపై ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, సిబ్బంది కన్నేశారని బీజేపీ నేతలు అంటున్నారు. ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలపై, ప్రజాభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నివేదికలు అందిస్తున్నారట. ఇందుకు స్పష్టమైన ఆధారాలు కూడా దొరికాయట. కమలాపూర్ మండలంలో శుక్రవారం ఐబీ సిబ్బంది రాజకీయ సర్వే నిర్వహిస్తూ తమకు దొరికారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
దాదాపు ఇరవైకి పైగా అంశాలపై హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల నుంచి ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బంది ఆరా తీస్తున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. నాలుగైదు రోజుల క్రితం జమ్మికుంట కూరగాయల మార్కెట్లో కూడా కొందరి నుంచి సమాచారం సేకరించారట. మండలానికో పదిమంది ఇంటలిజెన్స్ సిబ్బంది మకాం వేసి ఆర్టీసీ బస్‌స్టేషన్లు, హోటళ్లు, కిరాణం దుకాణందారులు, పాన్‌షాపులు, వ్యవసాయ మార్కెట్లు, గ్రామ కూడళ్ల వద్ద సమాచారం సేకరిస్తున్నారట. అయితే ఇది కొత్తేమీ కాదు.. అధికారంలో ఉన్నవారు ఇంటలిజెన్స్ నుంచి నిత్యం సమాచారం సేకరిస్తూనే ఉంటారు.