ఆ ‘ఓసీ’ మంత్రులకు మధ్యలోనే బ్రేక్ పడుతుందా?
జగన్ మంత్రివర్గంలో ఐదేళ్ల పాటు కొనసాగాలని మంత్రులంతా గట్టిగానే ట్రై చేస్తున్నారు. కానీ ముందు చెప్పిన విధంగా నెక్స్ట్ కేబినెట్ విస్తరణలో సగం పైనే మంత్రులకు చెక్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. మరో ఐదు నెలల్లో జరిగే కేబినెట్ విస్తరణలో పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ కేబినెట్‌లో ఉన్న ఓసీ మంత్రుల్లో సగం మందికి మధ్యలోనే బ్రేక్ పడుతుందని, వారు ఐదేళ్ల పాటు మంత్రులుగా కొనసాగడం కష్టమని తెలుస్తోంది.
జగన్ కేబినెట్‌లో ఓసీ వర్గానికి చెందిన మంత్రులు 11 మంది ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, ఆళ్ళ నాని, పేర్ని నాని, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజులు కేబినెట్‌లో ఉన్నారు. ఇందులో నలుగురు రెడ్డి వర్గానికి చెందినవారు కాగా, మరో నలుగురు కాపు వర్గానికి చెందినవారు. ఇంకా కొడాలి నాని కమ్మ... రంగనాథరాజు క్షత్రియ… వెల్లంపల్లి వైశ్య వర్గానికి చెందిన మంత్రులు.
ఇక ఇందులో రెడ్డి వర్గానికి చెందిన నలుగురు కేబినెట్‌లో కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కుదరని పక్షంలో ఇద్దరిని మాత్రం తప్పనిసరిగా కొనసాగిస్తారు. అటు కాపుల్లో కూడా ఇద్దరు మంత్రులకు మధ్యలోనే బ్రేక్ పడేలా కనిపిస్తోంది. ఇంకో ఇద్దరు ఐదేళ్లు కొనసాగుతారని తెలుస్తోంది. అటు కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నాని ఐదేళ్ల పాటు జగన్ కేబినెట్‌లో కొనసాగడం ఖాయమనే చెప్పొచ్చు.
అటు ప్రభుత్వం, ఇటు పార్టీ పరంగా బలమైన వాయిస్ వినిపిస్తున్న నాని మంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేదు. అటు రంగనాథరాజు ప్లేస్‌లో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ రాజు కేబినెట్‌లోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక దేవాదాయ శాఖ మంత్రిగా అనేకరకాలుగా విమర్శలు పాలైన వెల్లంపల్లిని ఐదేళ్లు కొనసాగించడం కష్టమే అని తెలుస్తోంది. మొత్తానికైతే ఓసీ మంత్రుల్లో సగం మందికి మధ్యలోనే బ్రేక్ పడనుంది.